సికిందరాబాద్ అల్లర్ల సూత్రధారి ఆవుల అరెస్టు
Publish Date:Jun 18, 2022
Advertisement
కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం ‘అగ్నిపథ్’ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో శుక్రవారం తీవ్ర విధ్వంసం సృష్టించిన కేసులో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ అల్లర్లను పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు ప్రోత్సహించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆవుల సుబ్బారావును అతని ప్రకాశం జిల్లా కంభంలో పోలీసులు అదుపులోకి తీసుకుని, నరసరావుపేటకు తరలించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆవుల సుబ్బారావు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లకు సుబ్బారావు పాత్ర ఉందనే అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సుబ్బారావుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 9 ఆర్మీ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. సైన్యం లో చేరేందుకు తమ అకాడమీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులను రెచ్చగొట్టి సుబ్బారావు ఈ విధ్వం సాన్ని ప్రోత్సహించినట్లు పోలీసు గుర్తించారు. అగ్నిపథ్ వల్ల నష్టం కలుగుతుందని వీడియో సందేశం ద్వారా ఆర్మీ అభ్యర్థులను సుబ్బారావు రెచ్చగొట్టినట్లు పోలీసులు తేల్చారు. సుబ్బారావు ఆధ్వర్యంలోనే ఆందోళనకారులు సికింద్రాబాద్ వచ్చినట్లు గుర్తించారు. నిరసనకారులకు సుబ్బారావు తమ అకాడమీ లోనే షెల్టర్ ఇచ్చినట్లు కూడా పోలీసులు తేల్చారు. ఆందోళనకారులకు వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలను ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ అకాడమీలు సరఫరా చేసినట్లు పోలీసు విచారణలో వెలుగు చూసిందని తెలుస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ అల్లర్ల కేసులో ఇంతవరకు పోలీసులు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు 12 మంది యువకులు ప్రధాన కారకులని పోలీసుల అనుమానం. వీరంతా ఆర్మీ ఉద్యోగాల ఆశావహులను రెచ్చగొట్టారని ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేష్ బాక్స్, 17/6 గ్రూప్ తో పాటు పలు పేర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఈ వాట్సాప్ సందేశాలు ఇప్పటికే వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో పాల్గొన్న పలువురు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ లో అల్లర్ల వెనుక కరీంనగర్ లోని స్టార్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు వసీం హస్తం ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన ఆందోళనకారులపై పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐఆర్ఎస్, ఐపీసీ, జీఆర్పీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఐఆర్ఏ 150 సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవ లేదా మరణశిక్షకు గురయ్యే అవకాశం ఉంది. ఈ కేసుల్లో చిక్కు కున్న వారు సైన్యంలో పనిచేసేందుకు అనర్హులవుతారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు కూడా ఇబ్బందులు వస్తాయి. శిక్షణనిచ్చేవారే ఉద్రిక్త పరిస్థితులు కల్పించేందుకు పూనుకుంటే సమాజం ఏం కావాలి? అగ్నిపథ్ పథకంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల దేశమంతటా తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఇంకా వెల్లువెత్తుతోంది. అన్ని రాష్ట్రాల్లో దాడులు, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. అయితే శుక్రవారం సికింద్రాబాద్‌లో జరిగిన దాడులు, హింసాత్మక సంఘటనలు ముఖ్యంగా రైళ్లకు నిప్పు పెట్టడా లు వంటివి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ కనీ వినీ ఎరుగనివి. ఇంత స్థాయిలో యువత తిరుగుబాటు, దాడు లకు పూనుకోవడానికి వారిని రెచ్చగొట్టినది సాయి డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు ఆవుల సుబ్బారావు అని తేలింది. సాయి డిఫెన్స్ అకాడెమీ సైనిక శిక్షణా కేంద్రాన్నించీ ప్రతీ యేడూ చాలామందికి శిక్షణనిచ్చి సైన్యంలో చేరడానికి వీలు కల్పిస్తున్నారు. అయితే ఈ సారి కేంద్రం అగ్నిపథ్ పథకంతో సైనిక శిక్షణలో వున్న యువతకు అన్యాయమే జరుగుతుందన్నది స్పష్ట మయింది. 17 నుంచి 23 సంవత్సరాల మధ్యలో యువత శిక్షణలో వున్నవారికి అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలోకి తీసుకున్నప్పటికీ వారికి కేవలం నాలుగేళ్లు మాత్రమే ఉద్యోగ భద్రత వుంటుంది. ఆ తర్వాత తొలగించవచ్చు. ఈ నియమం దేశంలో సైనిక శిక్షణ పొందుతున్న యువతకు ఆశాభంగమయింది. దాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో యువత తిరగ బడ్డారు. కానీ కేంద్రం ఇసుమంత కూడా వెనకడుగు వేయలేదు. పథకాన్ని అమలు చేయడానికే గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రైళ్ల దగ్ధం, హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో అల్లర్లు, పోలీసుల లాఠీచార్జీ చివరగా ఫైరింగ్ కూడా చోటుచేసుకుంది. అసలు కుర్రాళ్లు ఇంతగా రెచ్చి పోవడానికి రైళ్ల రాకపోకలను స్థంభింపజేయడానికి వారిని రెచ్చగొట్టింది ఆవుల సుబ్బారావు డిఫెన్స్ అకా డమీ సృష్టించిన ప్రత్యేక యాప్ పుణ్యమే అన్నది తేటతెల్లమయింది. వాట్సప్ గ్రూప్ ద్వారా వేగంగా సమా చారం విస్తరించి మరింత మంది రెండు తెలుగు రాష్ట్రాల యువత విరుచుకుపడ్డారన్నది బయట పడిం ది. ఇదంతా చాలా ముందుగానే ప్లాన్ చేసుకుని అమలు చేసిన పథకంగా తోస్తోందని పరిస్థితులను పరిశీలిస్తున్న విశ్లేషకులు అంటున్నారు. మరీ దారుణమేమంటే అటు ఆంధ్రా నుంచి పెద్ద సంఖ్యలో యువత వచ్చి ఇక్కడ దాడుల్లో పాల్గొనడానికి కావలసిన మద్దతు సుబ్బారావు సృష్టించిన యాప్ ద్వారానే లభించిందన్న వార్తలు వినపడుతున్నాయి. శిక్షణనిచ్చిన వారే ఇలాంటి దాడులు, దారుణాలకు ప్రోత్స హించడం అమానుషమే అవుతుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డిఫెన్స్ అకాడెమీలు, శిక్షణా కేంద్రాలు మరో విధంగా శాంతియుతంగా తమ గోడును తెలియజేయాలి అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ చాలా కాలం నుంచి శిక్షణ పొందుతూ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న యువ తకు కేంద్రం అగ్నిపథ్ నిర్ణయం పెద్ద షాక్ అనాలి. వూహించని నిర్ణయానికి వూహించని పరిణామాలే చోటుచేసుకున్నాయి.
http://www.teluguone.com/news/content/secuderabad-violance-kingpin-avula-arrest-25-137948.html





