హాస్య నటుడు అలీకీ ట్రాజడీయేనా.. జగన్ చెప్పిన తీపి కబురు రాజ్యసభ సీటు కాదా?
Publish Date:May 4, 2022
Advertisement
హాస్య నటుడు అలీకి జగన్ హామీ ఇచ్చిన తీపి కబురు అందడం లేదా? ఆశించినట్లుగా రాజ్యసభకు అలీకి అవకాశం ఇవ్వడం లేదా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అలీకి జగన్ హ్యాండిచ్చారనే అర్ధమౌతుంది. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. సంఖ్యా బలాన్ని బట్టి ఆ నాలుగూ కూడా వైసీపీ ఖాతాలోనే పడతాయి. జగన్ అలీని రాజ్యసభకు పంపుతారని హామీ ఇచ్చారనీ, అందుకే సినీ పరిశ్రమలో తనకు అత్యంత సన్నిహితుడైన పవన్ కల్యాణ్ ను కూడా కాదని అలీ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారనీ ఒక ప్రచారం ఉంది. అంతే కాకుండా జగన్ ఇటీవల స్వయంగా అలీని తిరుపతికి పిలిపించుకుని మరీ త్వరలో శుభ వార్త వింటారని చెప్పారనీ కూడా అంటున్నారు. ఆ శుభ వార్త రాజ్యసభ టిక్కెట్టేనని అలీతో సహా అంతా భావించారు. మరి అంతలోనే ఏమైందో రాజ్యసభ టికెట్ల అభ్యర్థుల ఎంపికలో అలీ పేరు కనీసం పరిశీలనకు కూడా రాలేదంటున్నారు. ఇక ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి రెన్యువల్ చేసే పరిస్థితే లేదని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. దీంతో రాజ్యసభకు జగన్ ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. జగన్ కేసులు వాదించే న్యాయవాది నిరంజన్ రెడ్డిని రాజ్యసభకు పంపించే యోచనలో జగన్ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంటే మరో రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఆ రెండు స్థానాలలో ఒకటి ఎస్సీలకు కేటాయించాలని జగన్ భావిస్తున్నారు. ఆ కోటాలో డొక్కా మాణిక్యవరప్రసాద్, బీరం మస్తానరావుల పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు. మరో స్థానాన్ని కమ్మ సామాజిక వర్గానికి కేటాయించి, విస్తరణలో ఆ వర్గానికి మొండి చేయి చూపి ఎదుర్కొన్న విమర్శల నుంచి బయటపడాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జగన్ నటుడు అలీ రాజ్యసభ ఆశలు గల్లంతైనట్లేనని అంటున్నారు. జగన్ ను నమ్ముకుని పార్టీలో చేరిన అలీకి ఇది రెండో ఆశాభంగంగా చెప్పుకోవచ్చు. మొదటిది 2019 ఎన్నికలలో అలీకి రాజమండ్రి, మంగళగిరిలలో ఏదో స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఆ ఆహామీ కారణంగానే అప్పట్లో జనసేనలో చేరుదామని భావించిన అలీ మనసు మార్చుకుని వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారంటారు. అలీ, పవన్ కల్యాణ్ మంచి స్నేహితులన్న విషయం సినీ పరిశ్రమ మొత్తానికి తెలుసు. అలాంటిది అలీ వైసీపీ తీర్ధం పుచ్చుకోవడంతో ఇరువురి మధ్యా స్నేహం కూడా చెడింది. పవన్ కల్యాణ్ అలీ వైసీపీలో చేరడాన్ని ప్రస్తావిస్తూ, సాయం పొందిన వ్యక్తులు కూడా ఇలా చేస్తారంటూ వ్యాఖ్యానించారు. అందుకు ప్రతిగా అలీ కూడా ఏం సాయం చేశారు పవన్ కల్యాణ్ గారూ, ఎవరికైనా చెప్పి సినిమా అవకాశాలు ఇప్పించారా? డబ్బు సాయం ఏమైనా చేశారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం కూడా తెలిసిందే.
అప్పట్లో అసెంబ్లీ సీటు విషయంలో మాటతప్పిన జగన్ ఇప్పుడు రాజ్యసభ టికెట్ విషయంలో మడమ తిప్పడంతో జగన్ ను నమ్ముకున్న అలీకి రెండు సార్లూ నిరాశ ఎదురైనట్లయ్యింది. రాజ్యసభ రేసులో ఎంటరౌతూనే ఔటైపోయిన అలీ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
http://www.teluguone.com/news/content/second-diaappointment-for-ali-out-from-rajyasabha-race-25-135413.html





