నగరిలో రోజా సీన్ సితారేనా?.. మంత్రి పదవి మూన్నాళ్ల ముచ్చటేనా?
Publish Date:Oct 18, 2022
Advertisement
ఇంట్లో ఈగల మోత... బయట పల్లకీల మోత అన్న సామెత కొంచం అటూ ఇటూగా మంత్రి రోజాకు అతికినట్లు సరిపోతుంది. నటిగా, రాజకీయ నాయకురాలిగా ఫైర్ బ్రాండ్ ముద్ర వేయించుకున్న రోజాకు మంత్రి పదవి చేపట్టిన తరువాత మాత్రం ఇబ్బందులు, ఇక్కట్ల, అవమానాలు, పరాభవాలే ఎదురౌతున్నాయి. నియోజకవర్గం బయట మంత్రి హోదాలో గాంభీర్యం పదర్శిస్తూ ఎలాగోలా నెట్టుకొచ్చేస్తున్నా సొంత నియోజకవర్గం నగరిలో మాత్రం ఆమెకు ఈగల మోతే.. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఆమెను పట్టించుకోవడం లేదు. కనీసం ప్రొటో కాల్ ప్రకారమైనా ప్రభుత్వ పరంగా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు ఆమెకు ఆహ్వానం సంగతి అటుంచి కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఈ విషయాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి రోజా తీసుకువెళ్లినా వారు లైట్ తీసుకుంటున్నారు. రోజాను కూడా లైట్ తీసుకోమనే చెబుతున్నారు. జిల్లాకే చెందిన మరో మంత్రి పెద్ది రామచంద్రారెడ్డికి జిల్లా అంతటా రాజమర్యాదలు జరుగుతుంటే.. రోజాకు మాత్రం పలకరించే దిక్కు లేని పరిస్థితి ఎదురౌతోంది. అధిష్ఠానం కూడా నగరి సహా జిల్లా అంతటా పెద్ది రెడ్డి మాటే చెల్లుబాటు అవుతుందనీ, ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించి ఆయన చెప్పిన విధంగా పని చేసుకుపోవడం ఉభయ తారకంగా ఉంటుందని రోజాకు చెప్పకనే చెబుతోందని నియోజకవర్గంలో ఓ టాక్. ఇక తాజాగా రోజాకు తన సొంత నియోజవకర్గంలో రైతు భరోసా కేంద్రం భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానం, సమాచారం లేకుండానే కానిచ్చేయడాన్ని రోజా జీర్ణించుకోలేకపోయారు. పైగా ఆ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించిన వారంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులే కావడంతో ఆమె తన ఆవేదనను పార్టీకి చెందిన మరో నాయకుడికి ఫోన్ ద్వారా తెలియజేశారు. ఆ ఫోన్ లో రోజా మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమంలో తెగవైరల్ అయిపోయాయి. రాజకీయాలు చేయడం కష్టం అంటే ఆమె ఆవేదన వ్యక్తం చేయడం, ప్రాణం పెట్టి పార్టీకి పని చేసినా... తన వ్యతిరేకులకే నియోజకవర్గంలో పెద్ద పీట వేసి ప్రోత్సహించడం బాధగా ఉందంటూ చెప్పడం ఇవన్నీ ఆమె గొంతుకతో సహా ఆడియో రిలీజ్ కావడం రోజాకే ఎదురు తిరిగింది. ఆ ఆడియోను రోజానే రిలీజ్ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నగరిలో రోజాకు మద్దతుగా కనీసం క్యాడర్ కూడా లేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పటికే గడపగడపకూ కార్యక్రమంలో ఆశించిన స్థాయిలో పాల్గొనడం లేదని పార్టీ అధినేత, సీఎం జగన్ రోజాకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ లో మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనీ, ఆ పునర్వ్యవస్థీకరణలో రోజాకు ఉద్వాసన ఖాయమనీ వైసీపీ శ్రేణుల్లోనే ఓ టాక్ జోరుగా సాగుతోంది. పైగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో విమర్శలను తిప్పి కొట్టే విషయంలో కూడా రోజా వెంటనే స్పందించకపోవడం పట్ల కూడా సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారంటున్నారు. ‘మీకు మంత్రి పదవులు ఇచ్చింది బుగ్గ కార్లలో తిరిగి సొంత పనులు చేసుకోవడానికి కాదంటూ జగన్ తీవ్ర స్థాయిలో చేసిన వ్యాఖ్యలు నేరుగా కాకున్నా పరోక్షంగా రోజాను ఉద్దేశించి చేసినవేనని కూడా పార్టీ శ్రేణులు అంటున్నాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రోజా పై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పదవీ ప్రమాణం చేసిన తరువాత హైదరాబాద్ వెళ్లి జగన్మాత విజయమ్మ ఆశీస్సులు తీసుకోవడం దగ్గర నుంచి.. ఇటీవల ఆమె జబర్దస్త్ షోకు వెళ్లడం వరకూ దాదాపు అన్ని విషయాలలోనూ రోజాపై పార్టీలోనే కాదు సామాజిక మాధ్యమంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రోజాకు క్లాస్ పీకారని అంటున్నారు. నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా బలమైన గ్రూపు తయారవ్వడం, మరో వైపు గడపగడపకూ కార్యక్రమంలో ఆమె చురుకుగా పాల్గొనడం లేదని పార్టీ అదిష్ఠానం భావిస్తుండటంతో వచ్చే ఎన్నికలలో రోజాకు పార్టీ టికెట్ అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/scene-reversr-to-minister-roja-in-nagari-constituency-25-145631.html





