జగన్ అరెస్ట్.. సజ్జల చెబుతున్నది ఇదేగా?
Publish Date:Jun 3, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు కావడం తథ్యం.. ఈ మాట అన్నది ఎవరో కాదు.. వైసీపీ హయాంలో ముఖ్య సలహాదారుగా, సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పి.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ కోటరీలో ముఖ్యభూమిక పోషిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి. ఔను జగన్ అరెస్టు అవుతారని సజ్జల స్వయంగా చెబుతున్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇష్టారీతిన కేసులు పెడుతోందనీ, ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో జగన్ పై కూడా కేసు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు. ఒక విధంగా జగన్ అరెస్టుకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని సజ్జల పరోక్షంగా అయినా అంగీకరించేశారు. సజ్జల మాటలతో వైసీపీ నేతలు, కేడర్ కూడా జగన్ అరెస్టు అవ్వడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసి, అందుకు ప్రిపేర్ అయిపోయినట్లుగా కనిపిస్తోంది. వేరే ఎవరి దాకానో ఎందుకు స్వయంగా జగన్ కూడా అరెస్టు అనివార్యమన్న భావనకు వచ్చేసినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే జగన్ తనను అరెస్టు చేయడానికి పోలీసులు ఎప్పుడైనా రావచ్చునని చెప్పారు. అంతే కాదు తాను తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నాననీ, అరెస్టు చేసుకోవచ్చుననీ సవాల్ కూడా విసిరారు. అయితే ఆ సవాల్ విసిరిన మరుసటి రోజే ఆయన బెంగళూరు చెక్కేశారు. దీంతో జగన్ లోనూ అరెస్టు భయం మొదలైందని అంటున్నారు. అదలా ఉంచితే.. జగన్ పై కేసులు నమోదు చేస్తారని సజ్జల అనడంతో ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జగన్ ప్రమేయం ఉందని సజ్జల పరోక్షంగా అంగీకరించేసినట్లేనని వైసీపీ వర్గాలలో చర్చ జరుగుతోంది. సజ్జల జగన్ అరెస్టు గురించి మాట్లాడటం ద్వారా.. మద్యం కుంభకోణం కేసులో జగన్ పాత్రను ఖరారు చేసినట్లైందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
http://www.teluguone.com/news/content/sajjala-saying-about-jagan-arrest-39-199184.html





