జగన్ ఏలుబడిలో సజ్జల రాజ్యం?
Publish Date:May 3, 2022
Advertisement
వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తాడేపల్లి ఫ్యాలెస్‌లో బాగా వినపడే పేరు.. సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ సలహదారుడిగా పేరుకే ఉన్నా.. సజ్జల మాత్రం అన్ని తానే అయి.. జగన్ ప్రభుత్వాన్ని నడిపించేస్తారనే టాక్ అయితే సదరు ప్యాలెస్‌లోనే కాదు.. ప్రతిపక్ష టీడీపీలో సైతం ఉంది. అందుకే ఆయన్ని సకల శాఖల మంత్రి అంటూ ఓ టాగ్ లైన్ కూడా తగిలించేశారీ పసుపు పార్టీ నేతలు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన వెనుక విజయసాయిరెడ్డి ఉండి నడిపిస్తే.. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వెనుక సజ్జల ఉండి నడిపిస్తున్నారని... అందుకే నడిచేవాడు వైయస్ జగనే అయిన ఆయన్ని నడిపించేవాడు మాత్రం సజ్జల అనే టాక్ అయితే ఫ్యాన్ పార్టీలో ఫ్యాన్ తిరిగినట్లు తెగ తిరుగుతోంది. ఇటీవల వైయస్ జగన్ కొత్త కేబినెట్ కొలువు తీరింది. అందులో 11 మంది పాత వారినే ఉంచి.. మరో 14 మందిని కొత్తవారికి మంత్రి పదవులు కట్టబెట్టడంలో ఈ సజ్జల వారు తన అగ్‌మార్కు రాజకీయాన్ని చూపించారని మంత్రి పదవులు ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు తెగ చెవులు కొరుక్కుంటున్నారని సమాచారం. అదీకాక.. ఎన్నికల్లో గట్టి పోటి ఇచ్చి.. గెలిచిన ఎమ్మెల్యేలు.. అంటే పవన్ కల్యాణ్‌పై భీమవరం, గాజువాకలో గెలుపొందిన ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, మంగళగిరిలో నారా లోకేశ్‌పై గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డిలాంటి వాళ్లకు మంత్రి పదవులు కట్టబెట్టకుండా.. ఇలా పార్టీలోకి వచ్చి.. అలా అసెంబ్లీ టికెట్ తీసుకుని అలా అలా గెలిచి... అసెంబ్లీలోకి అడుగు పెట్టిన వారికి.. అదీ కూడా కీలక మంత్రి పదవులు కట్టబెట్టడం ఎంత వరకు సబబు అని ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం ఆగ్రహంతో లొలోపల కుతకులాడిపోతుందట. ఇదంతా.. సజ్జల వారి యవ్వారమంటూ ఈ సకల శాఖల మంత్రిపై సదరు వర్గం వ్యంగ్య బాణాలు సంధిస్తోందట. వచ్చేది ఎన్నికల సీజన్.. మళ్లీ కేబినెట్ కూర్పు ఉండదు.... ఉండబోదు. అలాంటి వేళ... కేబినెట్ కూర్పు అంటే ఆచి తూచి అడుగులు వేయాలి. ఆ క్రమంలో ప్రతిపక్ష పార్టీల్లోని కీలక నేతలపై గెలుపొందిన వారిని ఎంపిక చేసి.. వారికి కీలక మంత్రి పదవులు కట్టబెట్టి.. వారి వారి నియోజకవర్గాల్లో అభివృద్ధిని పరుగులు తీయించాలి. కానీ అలాంటివి ఏమీ లేకుండా.. ఎవరెవరినో మంత్రి పదవులు కట్టబెట్టడం ఏమిటని వారంతా సందేహం వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు తాజాగా మాజీ మంత్రులు అయిన వారిలో చాలా మంది అంతా సజ్జల వారే చేశారంటూ ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. అందుకు మేకతోటి సుచరిత ఎపిసోడే ఓ ఉదాహరణ. కొత్త మంత్రులు పేర్లు ప్రకటించగానే.. ఆమె నివాసం వద్ద సుచరిత అభిమానులు అయితే సజ్జలపై ఓ రేంజ్‌లో దుమ్మెత్తి పోయడమే కాదు.. రచ్చ రచ్చ చేసి పెట్టారు. ఇక సీఎం జగన్ సమీప బంధువు బాలినేని అలకపాన్పు ఎక్కితే.. ఆయన ఇంటికి సజ్జల కాలిగాలిన పిల్లిలా ముచ్చటగా మూడు సార్లు వెళ్లి వచ్చారు. అలాగే పాత కేబినెట్‌లో 11 మందిని మళ్లీ కొత్త కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగించడంపై.. నాటి వారి సహచరులు అయితే .. వాళ్లు చేసిన పుణ్యమేమిటి? మనం చేసిన పాపమేమిటని వారు.. తాజాగా మాజీలు అయిన తమ తమ సహచరుల వద్ద ప్రశ్నించుకొంటున్నట్లు ఓ టాక్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందుకే అప్పుడెప్పుడో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఆకలి రాజ్యం సినిమా అర్థమైందీ. నిన్న కాక మొన్న బాపు దర్శకత్వంలో వచ్చిన రామరాజ్యం సినిమా కూడా అర్థమైందీ. కానీ జగన్ డైరక్షన్‌లో వస్తుందో లేక సజ్జల సొంత డైరెక్షన్‌లో వస్తున్న ఈ సజ్జల రాజ్యం మాత్రం అర్థం కావడం లేదని మంత్రి పదవులు పోయి తాజా తాజాగా మాజీలు అయిన వారు... మంత్రి పదవులు వస్తాయని తెగ ఆశ పడి తీవ్రంగా భంగ పడ్డవారంతా ఓ చర్చకు తెర తీసినట్లు ఫ్యాన్ పార్టీలో గుసగుసలు తారాస్థాయికి చేరాయని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/sajjala-rule-in-jaganr-egime-25-135375.html





