రాయల్ ఎన్ ఫీల్డ్.. అప్పుడు ఎక్కా.. ఇప్పుడు తెచ్చా.. చంద్రబాబు
Publish Date:May 8, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతిలో మరో ముందడుగు పడింది. రాష్ట్రానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. గురువారం (మే 7) కలెక్టర్ల సదస్సులో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఏపీలో పెట్టుబడుల వాతావరణం పండుగలా సాగుతోందన్న ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, తద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను లభించే అవకాశాలు దండిగా ఉంటాయన్నారు. ఇక రాయల్ ఎన్ ఫీల్డ్ కు ఉన్న క్రేజ్ గురించి చెబుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, అది మెజస్టిక్ వెహికల్. అప్పట్లో ఎక్కేవాళ్ళం, ఇప్పుడు అదే వాహనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురాగలిగాం అని అన్నారు. ఇన్నాళ్లూ తమిళనాడుకే పరిమితమైన ఈ ఐకానిక్ బ్రాండ్‌ను ఏపీకి తీసుకురావడం గొప్ప విజయమని చెప్పారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాతావరణం మళ్లీ పుంజుకుందన్నారు. పారిశ్రామిక వేత్తల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని ఈ పరిణామం స్పష్టం చేస్తోందన్న చంద్రబాబు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి గ్లోబల్ బ్రాండ్ ఏపీలో అడుగుపెట్టడం రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చివేస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు ఏపీలో అడుగుపెట్టే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకతో ఆటోమొబైల్ రంగానికి ఏపీ కేంద్ర బిందువుగా మారుతుందనడంలో సందేహం లేదు. ఉపాధి కల్పనతో పాటు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి కూడా ఇది దోహదపడనుంది.
http://www.teluguone.com/news/content/royal-enfield-in-ap-36-219218.html





