మహిమాన్విత రొట్టెలే కాదు... మత సామరస్యపు రొట్టెలు కూడా!
Publish Date:Oct 12, 2016
Advertisement
భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. ఇది చిన్నప్పుడు అందరూ చదువుకున్నదే. కాని, నిజంగా పెద్దగయ్యే కొద్దీ మన దేశంలో ఏకత్వంలో భిన్నత్వమే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒక దేశమే అయినా ఎవరి మతం వారిది, ఎవరి కులం వారిది, ఎవరి వర్గం వారిది, ఎవరి భాష, యాస, ప్రాంతం వారిది. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు! ఎప్పుడో పాకిస్తాన్ పై క్రికెట్ మ్యాచ్ గెలిస్తేనో, లేదంటే ఆ దేశంపై తాజాగా జరిగినట్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగితేనో మన వాళ్లు పెద్ద మొత్తం లో ఏకం అవుతారు. అప్పటికీ భారతదేశంలో నిస్సిగ్గుగా, దుర్మార్గంగా శత్రుదేశం మేలు కోరేవారు చాలా మందే వుంటుంటారు. ఇన్ని వున్నా ఇండియా ఒక్కటిగా ఎలా వుంటోందని మీకెప్పుడైనా ఆశ్చర్యం కలిగిందా?
భారతదేశాన్ని ఒక్కటిగా వుంచేది, వుంచుతోన్నది ఇక్కడి జనాల విశ్వాసం. అవును, యుగయుగాలుగా మన వాళ్లు విశ్వాసానికి ఇచ్చిన ప్రాముఖ్యత మరి దేనికి ఇవ్వరూ. తిరుమలలో ప్రతీ రోజు లక్షల మంది ఎందుకని పోటెత్తుతారు? పుష్కరాల వంటివి వస్తే ఎందుకు వేలాది మంది తరలి వస్తారు? ఇలా తార్కాణాలు బోలెడు! భారతీయులకి ఒక్కసారి విశ్వాసం కుదిరితే దాన్ని కూల్చేయటం దాదాపు అసంభవం! అలాంటి విశ్వాసానికే ప్రతీకే... రొట్టెల పండుగ!
నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ ఏదో ఒక మతానికి సంబంధించిన వ్యవహారం కాదు. ముస్లిమ్ లు పవిత్రంగా భావించే దర్గాకు పోయి హిందువులు జరుపుకునే అసలు సిసలైన సెక్యులర్ పండుగ! దేశ, విదేశాల నుంచీ బారాషహీద్ దర్గాకు భక్తులు వచ్చినా ముస్లిమ్ లతో పాటూ ఎక్కువగా పాల్గొనేది హిందువులే. మరీ ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల హిందువులు. అసలు రొట్టెల పండుగ వాతావరణం ఒక్కసారి చూస్తే భారతదేశం ఐకమత్యంలోని మర్మం తెలిసిపోతుంది!
నెల్లూరు జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే రొట్టెల పండుగ నిజానికి పన్నెండు మంది ఇస్లాం మత ప్రచారకుల జ్ఞాపకార్థం జరుపుకుంటారు. వాళ్లు మక్కా నుంచి ఇక్కడికి వచ్చి ఇస్లాం మత వ్యాప్తి కోసం యుద్ధంలో మరణించారు. వాళ్ల సమాధులున్న చోటే బారా షహీద్ దర్గా. అక్కడ గతంలో ఒక నవాబు భార్యకు ఆరోగ్యం బాగుపడటంతో రొట్టెల పండుగ మొదలైంది. నవాబు, ఆయన భార్య బారా షహీద్ దర్గాలో నిద్ర చేశాక తెల్లవారే సరికి ఆమె ఆరోగ్యం కుదటపడటంతో ఆ రాజు తాము తెచ్చుకున్న రొట్టెల్ని అందరికీ పంచాడు. అప్పట్నుంచీ రొట్టెలే ప్రసాదంగా కొనసాగుతూ వస్తున్నాయి. అంతే కాదు, ఇప్పుడు లక్షల మంది ఈ రొట్టెల్ని ఇచ్చిపుచ్చుకుంటూ కోరికలు తీరుతాయని విశ్వసిస్తున్నారు...
రొట్టెల పండుగ వెనుక కథ ఎలా వున్నా దీంట్లోని మత సామరస్యం అద్భుతం. ముస్లిమ్ లు పవిత్రంగా భావించే ఒక దర్గాను హిందువులు కూడా క్షేత్రంగా భావించటం... మన దేశ సంస్కృతికి నిదర్శనం. ఇలాంటి అద్భుతాలు ఎన్నో వున్నాయి భారతదేశంలో. వేములవాడ లాంటి చాలా చోట్ల హిందువులు ప్రధాన ఆలయంతో పాటూ దర్గాల్ని కూడా సందర్భిస్తుంటారు. అయ్యప్ప దీక్ష చేసిన వారు వావర్ స్వామి అనే ముస్లిమ్ మహాత్ముడ్ని శరణు ఘోషలతో తలుచుకుంటూ వుంటారు....
రొట్టెల పండుగలో రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటే నిజంగా కోరికలు తీరతాయా? ఆ విషయం విశ్వాసం కలిగిన భక్తులకే తెలియాలి! కాని, భారతదేశం మతాల ప్రాతిపదికన విచ్ఛిన్నం కావద్దనే కోరిక మాత్రం ఈ రోట్టెలు తప్పక తీరుస్తాయి...
http://www.teluguone.com/news/content/rottela-panduga-45-67682.html





