రోజాకు నగరిలో ఈసారి అంత వీజీ కాదు
Publish Date:May 3, 2022
Advertisement
ఆర్కే రోజా.. రాజకీయ నాయకురాలిగా మారిన సినీ నటి. ప్రస్తుతం ఏపీలో పర్యాటకశాఖ మంత్రి కూడా. రాజకీయంగా తనకు భిక్షపెట్టిన తెలుగుదేశం పార్టీకి హ్యాండిచ్చి వైసీపీ గాలి బాగా వంట బట్టించుకున్న నాయకురాలు. 2014లోను 2019లో కూడా వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆమెను చిత్తూరు జిల్లా నగరి నుంచి ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపించారు. అయినప్పటికీ.. రోజా తమ బాగోగులు చూడడంలేదని, మూడేళ్లుగా స్థానిక సమస్యలు పట్టించుకోవడంలేదని నియోజకవర్గం ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. కేవలం టీవీలో జబర్దస్త్ కార్యక్రమానికే పరిమితం అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నగరి నియోజకవర్గంలో రోజా ఇటీవలి కాలంలో పర్యటించినప్పుడల్లా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత, ప్రతిఘటన ఎదురవుతూనే ఉన్నాయి. తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ దళితవాడ మహిళలు, యువకులు రోజాను నిలదీస్తున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మూడేళ్లు ఏపీఐఐసీ చైర్మన్ పదవిలో ఉండి కూడా నియోజకవర్గానికి రోజా ఒరగబెట్టిందేమీ లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. అదే నగరి నియోజకవర్గానికి 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా స్థానికులు ఆర్కే రోజాకే పట్టం కట్టారు. అయితే.. అప్పుడు ఆమెకు 47.23 శాతంతో 74 వేల 724 ఓట్లు పడ్డాయి. రోజాకు సమీప ప్రత్యర్థి, మాజీ టీడీపీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడికి 46.69 శాతంతో 73,866 ఓట్లు వచ్చాయి. అంటే 858 ఓట్లు మాత్రమే ముద్దుకృష్ణమ నాయుడి కన్నా అధికంగా రాబట్టుకోగలిగారు. 2014 ఎన్నికల కన్నా 2019 ఎన్నికల్లో అది కూడా వైఎస్ జగన్ గాలి వీస్తున్నప్పుడు కూడా మూడు వేలు లోపే మెజారిటీ రావడం అంటే రోజా బోర్డర్ మెజారిటీ దక్కించుకోవడం కిందే పరిగణించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నగరి నియోజకవర్గం ప్రజలు ముచ్చటగా మూడోసారి ఆమెను అసెంబ్లీ పంపే ప్రసక్తే లేదనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వస్తున్నాయి. ఎందుకంటే.. అధికార వైసీపీ ఎమ్మెల్యేగా ఉండడం, నియోజకవర్గాన్ని సరిగా పట్టించుకోపోవడం.. టీవీ షోలతో కాలక్షేపం చేయడం, వచ్చే ఎన్నికల్లో రోజాకు నగరి నియోజకవర్గంలో మూడోసారి ముళ్లకంప ఎదురవుతుందంటున్నారు. పర్యాటకశాఖ మంత్రి పదవిని రోజాకు సీఎం జగన్ కట్టబెట్టారు. ఈ ఏడాది దాటిపోతే.. వచ్చే సంవత్సరం ఇక ఎన్నికల ఏడాది అవుతుంది. ఈ కొద్ది కాలంలో రోజా మంత్రిగా ఏమాత్రం పనితనం చూపిస్తారో.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధిని చేస్తారో అనే సంశయాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలని సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, శ్రేణులను తొందరపెడుతున్నారు. జారిపోతున్న పార్టీ పరువును నిలబెట్టాలని ప్రతిఒక్కరినీ జగన్ పురమాయించారు. ఒక పక్కన పార్టీ బాధ్యతలతో పాటు మరో పక్కన నియోజకవర్గంపై రోజా ఏ మేరకు దృష్టి సారించగలరో అనే సంశయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఆర్కే రోజాకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎక్కువ. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి- రోజాకు ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. చిత్తూరు జిల్లాపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు ఎక్కువ. జిల్లాలో ఆయన చెప్పిందే వేదం అన్నట్లుంటుంది. పైగా ఆయన ఒక కొడుకు మిథున్ రెడ్డి లోక్ సభ ఎంపీ. మరో కుమారుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యే. పెద్ది రెడ్డి కుటుంబంలోనే ముగ్గురు ప్రజాప్రతినిధులగా కొనసాగుతున్నారు. నగరి నియోజవర్గంలోనే మంత్రి రోజాకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని రామచంద్రారెడ్డి తయారు చేశారంటారు. ఇంకో పక్కన రోజాకు ప్రత్యర్థులుగా టీడీపీ నుంచి మరో వెటరన్ నటి దివ్యవాణి బరిలో దిగుతారంటూ ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. మరో పక్కన మరో నటి వాణి విశ్వనాథ్ కూడా నగరి నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తారనే అంచనాలు వస్తున్నాయి. అదే జరిగితే ఈ సారి నగరి నియోజకవర్గంలో ముగ్గురు నటిమణుల మధ్య పోటీ రసవత్తరంగా.. నువ్వా నేనా అనే విధంగా జరిగే అవకాశలు మెండుగా ఉన్నాయి. అలాంటి సందర్భమే వస్తే.. నగరిలో రోజా గెలవడం అంత ఈజీ కాదని, హ్యాట్రిక్ కొట్టే ఛాన్సే ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఆర్కే రోజాకు నగరి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో 80 వేల 333 ఓట్లు పోలయ్యాయి. అంటే ఆమెకు 47.6 శాతం ఓట్లు వచ్చాయన్నమాట. సమీప టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ 77 వేల 625 ఓట్లు సాధించారు. గెలిచిన రోజాకు సమీప ప్రత్యర్థి గాలి భాను ప్రకాష్ కన్నా కేవలం 2 వేల 708 ఓట్లు మాత్రమే ఆధిక్యం సాధించగలిగారు. అంటే ప్రత్యర్థులిద్దరి మధ్యా ఎన్నికల పోరు నువ్వానేనా అనే విధంగా సాగిందనే చెప్పుకోవాలి. పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బాగా వీస్తున్న సమయంలో కూడా మూడు వేల కన్నా తక్కువ మెజారిటీ రావడంతో వచ్చే ఎన్నికల్లో రోజాకు విజయం అంత సులువేం కాదు అనే అంశంపై ఇప్పటి నుంచే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
http://www.teluguone.com/news/content/roja-win-in-nagari-is-not-eady-this-time-25-135372.html





