తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గా గద్దర్ కుమార్తె
Publish Date:Nov 17, 2024
Advertisement
రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాయుద్ధ నౌక దివంగత గద్దర్ కుమార్తెకు కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి వి. వెన్నెలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు యువజన పురోగతి, పర్యాటన, సంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో.. గద్దర్ కుమార్తెకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సముచిత గౌరవం లభించినట్లైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నెలకు కంట్మోనెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన సంగతి విదితమే. అయితే ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన లాస్య నందిత విజయం సాధించారు. ఆ తర్వాత లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించగా, కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ వెన్నెలకు టికెట్ ఇవ్వలేదు. ఆ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి చేరిన శ్రీగణేశ్‌కు టికెట్ ఇవ్వగా.. ఆయన విజయం సాధించారు. అయితే.. గద్దర్ చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో తన ప్రయాణాన్ని సాగించారు. ఈ క్రమంలోనే.. రాహుల్ గాంధీతో, రేవంత్ రెడ్డితో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఎన్నికలకు కొద్ది రోజులు ముందే గద్దర్ కన్నుమూయగా.. ఆయన అంత్యక్రియలను కాంగ్రెస్ పార్టీయే దగ్గరుండి జరిపించింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గద్దర్ సేవలను, ఆయన పోరాటాన్ని రేవంత్ రెడ్డి ప్రతిసారి స్మరించుకోవటమే కాకుండా, ఆయన గుర్తుగా నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డుగా పేరు మార్చారు. కేవలం గద్దర్ పోరాటాలను స్మరించుకోవటమే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులకు కూడా సముచిత స్థానం కల్పించి గౌరవించుకోవాలని భావించిన ప్రభుత్వం, ఇప్పుడు వెన్నెలకు సాంస్కృతిక సారథి చైర్ పర్సన్‌గా నియమించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే జరిగింది. అప్పట్లో ఈ సాంస్కృతిక సారథికి ఛైర్మన్‌గా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌గా ఉండగా.. ఆయకు కేబినెట్ హోదా కల్పించారు. అయితే.. ఇప్పుడు గద్దర్ కుమార్తె వెన్నెలను ఛైర్ పర్సన్‌గా నియమించినప్పటికీ.. ఆమెకు కేబినెట్ హోదా మాత్రం ఇవ్వలేదు.
http://www.teluguone.com/news/content/revanth-sarkar-appointed-gaddar-daughter-as-telangana-samskrutika-saradhi-chairperson-25-188534.html





