కేంద్రంతో కయ్యం.. కేసీఆర్ రూట్ లోనే రేవంత్?!
Publish Date:Jul 29, 2025
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూట్ లో ఢిల్లీతో యుద్ధానికి సిద్దమవుతున్నారా? ఇంతవరకూ భడేభాయి ప్రధాని మోదీతో అంతో ఇంతో సయోధ్యగా ఉన్న రేవంత్ రెడ్డి ఇక పై అందుకు విరుద్ధంగా యుద్దానికి సిద్దమవుతున్నారా? అంటే.. జరుతున్న పరిణామాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా సోమవారం (జూలై 28)మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. మరీ ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీ నుంచే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని తీసుకున్న నిర్ణయం యుద్ధ సంకేతంగానే చెబుతున్నారు. అది కూడా.. మందీ మార్బలంతో ఢిల్లీ వెళ్ళాలనే నిర్ణయం యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలనే ఇస్తోందని అంటున్నారు. ఒక విధంగా.. ఇది ఢిల్లీ పై దండయాత్రగా భావించ వలసి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్రంపై ప్రజాస్వామ్య పద్దతిలో వత్తిడి తేవడం వరకు ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ.. ముఖ్యమంత్రి నాయకత్వంలో మొత్తానికి మొత్తంగా రాష్ట్ర మంత్రి వర్గం,ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఇతర ప్రజాప్రతినిధులు, వందల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరికి తోడు బీసీ సంఘాల నాయకులు.. ఇంత మందితో దండయాత్రగా ఢిల్లీకి వెళ్ళడం అంటే కేంద్రం పై యుద్దాన్ని ప్రకటించడం కంటే ఏమాత్రం తక్కువ కాదని అంటున్నారు. కాగా సోమవారం (జులై 28) ఇంచుమించుగా నాలుగు గంటలకు పైగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక ఎన్నికలో ముడిపడిన బీసీ రిజర్వేషన్ అంశంపైనే చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పై ఢిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణను ఖరారు చేసింది. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో చేపట్టాల్సిన కార్యాచరణకు ఆమోదం తెలిపింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆగస్టు ఐదో తేదీన పార్టీ ఎంపీల ద్వారా పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులందరితో ఆగస్టు 6న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, ఆగస్టు ఏడో తేదీన ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా దాదాపు 200 మంది ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోరుతూ వినతి పత్రం అందించాలని నిర్ణయించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరిలతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు, పార్టీకి చెందిన 100 మంది ఎంపీలం రాష్ట్రపతిని కలవాల నుకుంటున్నామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులందరం ఢిల్లీకి వెళుతున్నామని, బీసీ మేధావులు, బీసీ నాయకులు, కుల సంఘాల నాయకులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. 42శాతం రిజర్వేషన్లు ఆశించే ప్రతి బీసీ బిడ్డా ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. రాజకీయ పరిశీలకులు మాత్రం, ఇది కేవలం స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ కు పరిమితమైన అంశం కాదని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, కులగణనతో మొదలు వ్యూహాత్మకంగా ముందుకు తీసుకు పోతున్న భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగంగానే ఢిల్లీని వేదిక చేసుకుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/revanth-reddy-in-kcr-route-39-203007.html





