శివుడు పేదల దేవుడు, రాముడు ధనవంతుల భగవంతుడు: రేవంత్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం.!
Publish Date:Sep 29, 2026
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాది ప్రజల సాంస్కృతిక, మత గుర్తింపునకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి. దేశ రాజధాని హస్తినలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రజల సాంస్కృతిక, మతపరమైన గుర్తింపుల గురించి చేసిన విశ్లేషణ రాజకీయదుమారాన్ని రేపింది. రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో విభజన తెచ్చేలా సీఎం రేవంత్ మాట్లాడారంటూ బీజేపీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల ఆరాధనా విధానాలు, దేవుళ్ల ప్రాధాన్యతను వివరిస్తూ.. రేవంత్ రెడ్డి ఆ మీడియా సమావేశంలో దక్షిణాది వారు ద్రావిడులని, ఉత్తరాది వారులు ఆర్యులని అన్నారు. దక్షిణాది వారు శివభక్తులు, ఉత్తరాది వారు శ్రీరామ భక్తులుగా అభివర్ణించారు. అక్కడితో ఆగకుండా బీజేపీ నాయకులు ఎప్పుడూ జై శ్రీరామ్ నినాదాలకే పరిమితమవుతారని, హర హర మహాదేవ్'అని ఎందుకు అనరని నిలదీశారు. శివుడిని పేదల దేవుడిగా, రాముడిని ధనవంతుల దేవుడిగా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. పెను వివాదానికి హేతువయ్యాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే హిందువులను ప్రాంతాల వారీగా, దేవుళ్ల పేరుతో విడగొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు. సోమనాథ్ ఆలయ నిర్మాణం మొదలుకొని అనేక ధార్మిక ప్రాజెక్టులను గతంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని, ఇప్పుడు మళ్లీ అదే వైఖరిని ప్రదర్శిస్తోందని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై శ్రీరామ్'తో పాటు 'హర హర మహాదేవ్ అని కూడా నినదించే అంటున్నారు. రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. హిందువుల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు.
[Revanth Reddy Comments, Lord Rama, Lord Shiva controversy, BJP, Congress, North South India Identity, National politics, Telugu One]
http://www.teluguone.com/news/content/revanth-reddy-comments-25-232853.html




