హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2.. కేంద్రంపై రేవంత్ డైరెక్ట్ ఎటాక్ఘ!
Publish Date:Jun 16, 2026
Advertisement
హైదరాబాద్ నగర ప్రయాణికులకు అత్యంత కీలకమైన మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టు రాజకీయ దుమారానికి కేంద్రబిందువుగా మారింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆలస్యం కావడం వెనుక కేంద్ర ప్రభుత్వం, కొందరు కీలక నేతల రాజకీయ కుట్రలు ఉన్నాయంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే ఈ మెట్రో విస్తరణను కావాలనే అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. అసలింతకీ జరిగిందేంటంటే.. మెట్రో ఫేజ్ 1 టేకోవర్.. దానికి సంబంధించిన రీఫైనాన్సింగ్ నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మెట్రో మొదటి దశను నిర్వహించిన ఎల్ అండ్ టీ సంస్థ భారీ నష్టాల కారణంగా ఫేజ్ 2 విస్తరణకు ముందుకు రాకపోవడంతో.. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను తన అధీనంలోకి తీసుకుంది. అందు కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 1,400 కోట్ల మార్జిన్ మనీతో పాటు రూ. 84 కోట్ల ప్రాసెసింగ్ ఫీజును కూడా చెల్లించింది. ఎల్ అండ్ టీ మెట్రోకు ఉన్న రూ. 13 వేల 600 కోట్ల బ్యాంక్ రుణాలను క్లియర్ చేయడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్ సీ ద్వారా ఒక జపాన్ సంస్థ నుండి 4 శాతం వడ్డీకి రీఫైనాన్స్ ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. జపాన్ సంస్థ ఇప్పటికే ఈ నిధులను ఐఆర్ఎఫ్‌సీకి బదిలీ చేసింది. ఈ నెల15 నాటికే అంటే సోమవారం నాటికే ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందాలి.. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి పత్రాలను సమర్పించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఈ నిధుల బదిలీని నిలిపివేసింది. దీనిపైనే రేవంత్ కేంద్రంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నిధుల నిలిపివేత వెనుక కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రత్యక్ష ఉందని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి గత నెల 20న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను, 21న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని అనుమతులు సులభంగా ఇస్తే రాష్ట్రంలో బీజేపీని మూసుకోవాల్సి వస్తుందని ఒత్తిడి తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్‌ల సలహా తోనే కిషన్ రెడ్డి ఈ కుట్రను అమలు చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా.. విశాఖపట్నం వంటి నగరాల మెట్రో ప్రాజెక్టులకు సులభంగా అనుమతులు ఇస్తున్న కేంద్రం, హైదరాబాద్ విషయంలో మాత్రం ఎందుకు చేతులెత్తేస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రానికి ఓ సవాల్ కూడా విసిరారు. కేంద్ర ప్రభుత్వం ఈ 122 కిలోమీటర్ల మెట్రో ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండటానికి ఇష్టపడకపోతే, తక్షణమే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలనీ, కేంద్రం రూపాయి ఇవ్వకపోయినా 100 శాతం ఈక్విటీతో పూర్తి ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి, మెట్రో విస్తరణ పనులను పూర్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నిధుల బదిలీని ఆపడం ద్వారా సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మేడ్చల్ వంటి కీలక ప్రాంతాల ప్రజలకు మెట్రో సౌకర్యాన్ని దూరం చేయవద్దని, కిషన్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేయాలని సీఎం డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/revanth-launches-a-direct-attack-on-the-centre-25-223106.html




