హస్తినలో తెలంగాణ సీఎం.. కేంద్ర మంత్రులు, సోనియాతో భేటీలతో బిజీబిజీ
Publish Date:Dec 16, 2025
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారానమ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొల్పనున్న 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సహకారం అందించాలని కోరారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా నాలుగు లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. వీటి నిర్మాణం, ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు దాదాపు 30 వేల కోట్ల రూపాయలు అవసరమౌతాయని తెలిపిన ఆయన వీటి ఏర్పాటు కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రిని కోరారు. అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయిన సీఎం రేవంత్.. ఆ సందర్భంగా హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయాలని విజ్ణప్తి చేశారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని గుర్తించామని తెలియజేశారు. అలాగే అవసరమైతే వెంటనే తరగతులు ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ కూడా రెడీగా ఉందని తెలిపారు. ఐఐఎం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తే.. అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉ:దన్నారు. అదే వి ధంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా తొమ్మది కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహార్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ కు తెలిపారు రేవంత్ రెడ్డి. ఇక పోతే కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గంధీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణలో ఈ నెల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వివరాలను తెలిపారు. అలాగే.. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2024ను సోనియాకు అందజే శారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనతో గత రెండేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, భవిష్యత్ ప్రణాళికలను రేవంత్ ఈ సందర్భంగా సోనియాగాంధీకి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో రేవంత్ సర్కార్ పాలన, రాష్ట్ర అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి దూరదృష్టిపై సోనియాగాంధీ అభినందించారు.
http://www.teluguone.com/news/content/revanth-busy-in-delhi-25-211088.html




