హమ్మయ్య.. శాంతించిన వరుణుడు
Publish Date:Jul 19, 2022
Advertisement
ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలు కాస్తంత తగ్గుముఖం పట్టడంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుత నీటిమట్టం 54వేల అడుగులకు చేరుకుంది. కానీ ఇక్కడ మూడో ప్రమాద హెచ్చరిక మాత్రం కొనసాగుతోంది. 53 అడుగుల లోపు తగ్గితేగాని ఈ హెచ్చరికను అధికారులు ఉపసంహ రించరు. మొత్తంమీద జిల్లాలోని ఏడు మండలాల్లో 71 గ్రామాలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నా యి. 12వేలకు పైగా ఇళ్లు ముంపునకు గురికాగా సోమవారానికి 11 వేల ఇళ్లు బయటపడ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని రప్పించి, పారిశుధ్య చర్యలను వేగవంతం చేశారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని కొన్ని గ్రామాలకు రహదారి లేకపోవడంతో ఆర్మీ హెలికాప్టర్ ద్వారా నిత్యావసర సరుకులను తీసుకెళ్లారు. 114 గ్రామాలకు చెందిన 27,778 మంది వరద బాధితులకు 79 పునరావాస కేంద్రాల్లో భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. గోదావరి వరద ఉగ్రరూపం దాల్చి తిరిగి తగ్గుముఖం పట్టినా రామాలయం పడమర మెట్లు, విస్తా కాంప్లెక్స్, నిత్యాన్నదాన సత్రం, పలు దుకాణాలు ఇంకా గోదావరి వరద నీటలోనే మునిగి ఉన్నాయి. ఉత్తర ద్వార ప్రాంగణం, మిథిలా స్టేడియం వద్ద కూడా ఇంకా వరద నీరు నిలిచిపోయింది. సీఎం కేసీఅర్ రివ్యూలో మందలించినా జిల్లా యంత్రాంగం తీరు మారలేదు. స్పెషల్ అధికారులు భారీ ఎత్తున వరద వస్తోందని తెలిసినా ముందే సింగరేణి మోటార్లను తెప్పించడంలో నిర్లక్ష్యం వహించారు. సీఎం కేసీఅర్ సూచన చేసినా వరద నీరు ఎత్తి పోయడంలో అధికారులు విఫలమయ్యారు. ఇలా వుండగా, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 6,24,610 క్యూసెక్కులకు చేరింది. 85 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. సరస్వతీ బ్యారేజ్ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 17,744 క్యూసెక్కులు కాగా.. దీనికి చెందిన 66 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తు న్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి తీవ్రస్థాయిలో వరదలొచ్చిన నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని బొమ్మాపూర్ శివారులో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కర కట్ట కోతకు గురైంది. 30 మీటర్ల మేర గండి పడింది. దీంతో సుమారు 25 ఎకరాల్లోని పంటల్లో ఇసుక మేట లు వేసింది. బ్యారేజీ కరకట్టకు వినియోగించిన మట్టితోపాటు రివిట్‌మెంట్‌కు వినియోగించిన బండరాళ్లు పంట చేలల్లో వచ్చి చేరాయి. ఇప్పుడు వరద తీవ్రత తగ్గి.. చేను వద్దకు చేరుకున్న రైతులు ఇసుక మేట లను చూసి ఆందోళనకు గురయ్యారు. ఇసుక మేటల కారణంగా పత్తిమొక్కలు పూర్తిగా చనిపోయాయని బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం బ్యారేజీ ఇదే కరకట్ట బెగ్లూర్ శివారులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద 50 మీటర్ల మేర కోతకు గురైంది. వరదలు తగ్గితే ఇంకా ఎన్నిచోట్ల కోతకు గురై ఉంటుం దనే విషయం బయటపడుతుందని రైతులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/respite-from-rains-25-140075.html





