హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం...రెండో దశ వన్‌వే ట్రయల్ రన్ ప్రారంభం
Publish Date:Jun 21, 2026
Advertisement
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు నగర అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఆదివారం రెండో దశ వన్‌వే ట్రయల్ రన్‌ను పోలీసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్ మీడియాతో మాట్లాడారు. సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నగర అభివృద్ధి కోసం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా గత ఏప్రిల్ 5న తొలి విడత వన్‌వే ట్రయల్ రన్ నిర్వహించామని, ఆ సమయంలో ఎదురైన సమస్యలు, లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దిన తర్వాత ఇప్పుడు రెండో దశ ట్రయల్ రన్‌ను చేపట్టినట్లు తెలిపారు. మొదటి ట్రయల్ రన్ వేసవి కాలంలో నిర్వహించడంతో వాహనాల రద్దీ తక్కువగా ఉందని, అయితే ప్రస్తుతం సాధారణ పరిస్థితులకు దగ్గరగా ట్రాఫిక్‌ను అంచనా వేసేందుకు మరోసారి ట్రయల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈరోజు ఆదివారం కావడంతో ట్రాఫిక్ కొంత తక్కువగా ఉన్నప్పటికీ, సాధారణ పనిదినాల్లో వాహనాల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ట్రయల్ రన్ విజయవంతం కావాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని సజ్జనార్ అన్నారు. గతంలో సహకరించినట్లుగానే ఈసారి కూడా ట్రాఫిక్ పోలీసులు సూచించే మళ్లింపులు, సైన్బోర్డులను గమనించి వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని కీలక కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిబ్బంది, సైన్‌బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారులకు మార్గనిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల భవిష్యత్తులో ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాసులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీంతో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలు నిలిచిపోవడం గణనీయంగా తగ్గి, సుదూర ప్రయాణాలు కూడా నిరాటంకంగా సాగుతాయని చెప్పారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంబులెన్స్‌ల రాకపోకలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు. అలాగే కేబీఆర్ పార్క్‌కు వచ్చే వాకర్ల కోసం రోడ్డు దాటేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, ఇకపై పార్క్‌కు వచ్చే వారు తమ వాహనాలను ప్రధాన రహదారులపై నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ పార్కింగ్‌ను వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం ట్రాఫిక్ నియంత్రణ కోసం 150 మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నారని, అవసరమైతే గ్రేహౌండ్స్, ఆక్టోపస్ సిబ్బంది సేవలను కూడా వినియోగిస్తామని తెలిపారు. నగర ప్రజలందరూ పోలీసులకు సహకరించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు తోడ్పడాలని కోరారు. ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్ మాట్లాడుతూ రెండో దశ వన్‌వే ట్రయల్ రన్లో ట్రాఫిక్ మళ్లింపులు ఎలా పనిచేస్తున్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ట్రయల్ సందర్భంగా ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటికి వెంటనే పరిష్కారాలు అమలు చేస్తామని తెలిపారు. అవసరమైన చోట్ల రోడ్ల వెడల్పు పెంచడం, యూ-టర్న్‌లను విస్తరించడం వంటి ఇంజినీరింగ్ మార్పులు కూడా చేపడతామని వెల్లడించారు. ఈ ట్రయల్ ద్వారా వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తుది ట్రాఫిక్ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు.
http://www.teluguone.com/news/content/relief-for-hyderabad-traffic-36-223692.html





