అత్తాకోడళ్లు పొరపాటున కూడా ఇలాంటి విషయాలు షేర్ చేసుకోకూడదట..!
Publish Date:Jul 1, 2025
Advertisement
పెళ్లైన ప్రతి అమ్మాయి ఒక కొత్త ఇంటికి వెళుతుంది. అక్కడ భర్తతో పాటు ఆమె అత్తమామలు కూడా ఉంటారు. సాధారణంగా చాలా ఇళ్లలో భార్యాభర్తల కంటే అత్తాకోడళ్ల మధ్య జరిగే గొడవలే ఎక్కువ ఉంటాయి. అత్తాకోడళ్లు కలిసి ఒకే చోట ఉన్నా, లేకపోయినా.. అత్తాకోడళ్లు కొన్ని విషయాలు ఒకరితో మరొకరు చెప్పుకోకుండటం మంచిదని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. ఇంతకూ ఒకరితో ఒకరు అనకూడని విషయాలేంటి? తెలుసకుంటే.. బంధువుల విషయాలు.. అత్తవైపు బంధువులు అయినా, కోడలి వైపు బంధువులు అయినా చెడుగా మాట్లాడకూడదు. ఎవరివైపు బంధువుల గురించి వారికి ప్రేమ, అభిమానం ఉంటాయి. అత్త కోడలివైపు వారి గురించి, కోడలు అత్తవైపు వారి గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వస్తాయి. డబ్బు,నగలు.. అత్తాకోడళ్ల మధ్య ఏవైనా చర్చలు జరిగినా, ఒకరితో ఒకరు ఏదైనా చెప్పుకున్నా అది ఇంటి పనుల గురించి, ఏదైనా సమస్య ఉంటే వాటి గురించి మాట్లాడుకోవాలి. అంతే తప్ప డబ్బు, నగల గురించి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, ఒకరితో ఒకరు గొడవ పడటం చేయకూడదు. ఫిర్యాదులు.. ఎంతైనా భర్త అనేవారు అత్త కొడుకు. అతను ఏదైనా తప్పు చేసినప్పుడు అతని గురించి అత్తకు ఫిర్యాదు చేయడం మంచిది కాదు. తప్పు చేసినా సరే.. కోడలి ముందు కొడుకును తక్కువ చేయాలసి అతడిని దండించాలని ఏ అత్త అనుకోదు. పైగా తిరిగి కోడలినే మందలించే అవకాశం ఉంటుంది. దీని వల్ల అత్తాకోడళ్ల మధ్య గొడవలు వస్తాయి. కోడలి తల్లిదండ్రులు.. పెళ్లైన మాత్రాన ఆడపిల్లకు తల్లిదండ్రులంటే పరాయితనం రాదు. కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల ఆమె ప్రేమ జీవితాంతం ఉంటుంది. అయితే కోడలు తన ఇంట్లో ఉంటోంది కదా అని అత్తగారు కోడలి తల్లిదండ్రుల గురించి చులకనగా మాట్లాడటం, వారిని నిందించడం చేయరాదు. ఇది చాలా గొడవలకు దారి తీస్తుంది. పోలిక.. కోడలిని ఇతర కోడళ్లతో లేదా కూతురితో పోల్చడం, అత్తను ఇతర ఇంటిలోని అత్తతో పోల్చడం లాంటివి అత్తాకోడళ్లు చేయరాదు. దీని వల్ల ఇద్దరి మధ్య బంధం తెగిపోతుంది. అలవాట్లు.. కోడలు అయినా, అత్త అయినా వారు పెరిగిన వాతావరణంకు తగ్గట్టు వారి అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్ల గురించి పదే పదే విమర్శలు చేయడం, హేళన చేయడం చేయరాదు. ఇది చాలా అవమానకరంగా ఉంటుంది. పిల్లల పెంపకం.. జనరేషన్ మార్పును బట్టి పిల్లల పెంపకంలో కూడా తేడాలు ఉంటాయి. ఒకప్పుడు పెద్ద వాళ్లు పెంచిన విధానం వేరు.. నేటితరం వారు పిల్లలను పెంచే విధానం వేరు ఉంటుంది. వీటి కారణంగా ఒకరిమీద మరొకరు వాదించుకోకూడదు. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/relationship-tips-for-mothers-in-law-and-daughters-in-law-35-200992.html





