పంద్రాగస్టు వేడుకల్లో తొలిసారి వందేమాతరం గీతాలాపన.!
Publish Date:Aug 14, 2026
Advertisement
ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు భారత చరిత్ర పుటల్లో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తొలిసారిగా ఎర్రకోటపై జరిగిన అధికారిక వేడుకలలో జాతీయ గేయం వందేమాతరం పూర్తి పాఠాన్ని ఆలపించి ఒక నూతన సాంప్రదాయాన్ని ఆవిష్కరించారు. ఈ చారిత్రక ఘట్టంలో జాతీయ గీతంతో పాటు జాతీయ గేయానికి కూడా సమానమైన ప్రాధాన్యత కల్పించడం దేశవ్యాప్తంగా విశేష ఆకర్షణగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజులపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వెంటనే, 1721 ఫీల్డ్ బ్యాటరీ విభాగం ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్‌తో 21 సార్లు గన్ సెల్యూట్ సమర్పించారు. అనంతరం ఇండియన్ ఆర్మీ బ్యాండ్ వందేమాతరం పూర్తి స్వర సమ్మేళనాన్ని ప్రతిధ్వనింపజేసింది. ఆ వెనువెంటనే యథావిధిగా జాతీయ గీతమైన జన గణ మన ఆలాపన కొనసాగింది. జాతీయ గేయం వందేమాతరంకు 150 వసంతాలు పూర్తవుతున్న శుభసందర్భంలో ఈ అపూర్వ ఘట్టం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వేడుకల్లో భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు ఆకాశం నుంచి వేదికపైకి పూలవర్షం కురిపించాయి. ఇందులో ఒక హెలికాప్టర్‌పై జాతీయ జెండా, మరొక హెలికాప్టర్‌పై వందేమాతరం అని ముద్రించిన పతాకం గాలిలో ఎగురుతూ కనిపించాయి స్వతంత్ర భారత చరిత్రలో ఎర్రకోట ప్రాంగణంలో పూర్తిస్థాయి వందేమాతరం గీతాన్ని వాయించడం ఇదే ప్రథమమని ప్రధాని మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఇటీవలి కాలంలో జాతీయ గేయమైన వందేమాతరానికి, జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన రక్షణ, హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఆమోదించిన'జాతీయ గౌరవ అవమానాల నివారణ (సవరణ) బిల్లు-2026 కు కొద్దిరోజుల క్రితమే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నూతన చట్టం అమలులోకి రావడంతో వందేమాతరం విశిష్టత శాసనబద్ధమైంది. కొత్త చట్టం ప్రకారం వందేమాతరం గీతాలాపనకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా, అవమానించినా చట్టప్రకారం న చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ చారిత్రక మార్పుల ప్రభావం స్వాతంత్ర్య దినోత్సవానికి పూర్వరంగంలోనే స్పష్టంగా కనిపించింది. ;పంద్రాగస్టు వేడుకలకు ముందు రోజు అంటే శుక్రవారం (ఆగస్టు 14) ముందు రోజు రాత్రి జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడానికి ముందు, ప్రసంగం పూర్తయిన తర్వాత కూడా వందేమాతరం పూర్తి గీతాన్ని ప్రసారం చేశారు. భారతదేశ స్వదేశీ ఉద్యమ సమయంలో దేశ ప్రజలందరినీ ఏకం చేసి, స్వరాజ్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన అమూల్యమైన గీతం వందేమాతరమని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో లక్షలాది మంది త్యాగధనులకు స్ఫూర్తి నింపిన వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో, ప్రభుత్వ అధికారిక వేడుకల్లో ఆ గీతానికి పూర్వ వైభవం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. భవిష్యత్తులోనూ అన్ని అధికారిక ప్రభుత్వ కార్యక్రమాలు, జాతీయ దినోత్సవ వేడుకల్లో జాతీయ గీతంతో పాటు వందేమాతరం ఆలాపన జరగనుంది. RedFort, VandeMataram, IndependenceDayCelebrations, NationalSongVandeMataram, ProtectionLaw
http://www.teluguone.com/news/content/redfort-36-228964.html





