పశ్చిమబెంగాల్ లో ఓటెత్తిన జన ప్రభంజనం
Publish Date:Apr 24, 2026
Advertisement
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం (ఏప్రిల్ 23)జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్ ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో ఓటింగ్ శాతం 92 శాతాన్ని అధిగమించింది. ఇది బెంగాల్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ భారీ ఓటింగ్ ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గురువారం (ఏప్రిల్ 23) జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా క్యూ లైన్లలో నిలబడ్డారు. తుది గణాంకాల ప్రకారం, ఓటింగ్ శాతం 92.03 శాతంగా నమోదైంది. ముఖ్యంగా దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో అత్యధికంగా 94.98 శాతం ఓటింగ్ జరగగా, కూచ్ బెహార్‌లో 94.75 శాతం, బీర్భూమ్‌లో 93.88 శాతం ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ 82 శాతానికి పైగా పోలింగ్ జరగడం విశేషం. బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ భారీ ఓటింగ్ నమోదు కావడంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు కూడా కీలకమని చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,400 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నప్పటికీ.. పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగడం పట్ల ఎన్నికల ప్రధాన కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరగడం వల్లే ప్రజలు ఇంత భారీగా తరలివచ్చారని అధికారులు భావిస్తున్నారు. ఓటింగ్ శాతం భారీగా పెరగడంపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, ఇతర కూటములు ఈ రికార్డు స్థాయి పోలింగ్‌ను తమకు అనుకూలం అంటే తమకు అనుకూలమని విశ్లేషణలు చేస్తున్నారు. ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓటర్ల ఉత్సాహాన్ని అభినందించారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో జరిగిన మార్పులు, సిటిజన్‌షిప్ అంశాలు కూడా ప్రజలను చైతన్యపరిచినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మొదటి దశలో 1,478 మంది అభ్యర్థుల భవిష్యత్తు ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి దశలో కనిపించిన ఈ ఉత్సాహం రెండో దశలోనూ కొనసాగుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితం బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా, దేశ రాజకీయాలపై కూడా బలమైన ముద్ర వేసే అవకాశం ఉందంటున్నారు.
http://www.teluguone.com/news/content/record-poling-in-wesy-bengal-39-218128.html





