మిథున్ రెడ్డి కాషాయ తీర్థం.. జాప్యానికి కారణమేంటంటే?
Publish Date:Jan 18, 2026
Advertisement
వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ర రెడ్డి కమలం గూటికి చేరుతాడంటూ గత ఐదారు నెలలుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా మద్యం కుంభకోణంలో జైలు కెళ్లి బయటకు వచ్చిన మిథున్ రెడ్డి ఇక బీజేపీ తీర్థం పుచ్చుకోవడమ లాంఛనమేననీ, అయితే మిథున్ రెడ్డి కంటే ముందు మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కూడా కమలం కండువా కప్పుకుంటారనీ గట్టిగా వినిపించింది. అయితే ఆ ప్రచారం ఇప్పటికీ ప్రచారంగానే మిగిలిపోయింది. ఇంతలో విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం మొదలైంది. ఆ మాట స్వయంగా విజయసాయిరెడ్డే చెప్పారు. అది పక్కన పెడితే మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడానికి ఆటంకమేంటి? అన్న చర్చ ఆరంభమైంది. మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో అత్యంత కీలకమైన నేత. మిథున్ రెడ్డికి 2014- 24 మధ్య 500 శాతానికిపైగా ఆస్తుల పెరుగుదల ఏమంత సులువుగా జరగలేదు. జగన్ కి అత్యంత సన్నిహితుడు మిథున్ రెడ్డి. సరిగ్గా అదే సమయంలో జగన్ హయాంలో ఆయన కేబినెట్ లో పెద్దిరెడ్డి చాలా ముఖ్యుడు. భారీ ఎత్తున భూకబ్జాలు, అటవీ భూముల ఆక్రమణలు, ఆపై ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు యధేచ్చగా సాగాయనీ, తండ్రీ కొడుకులు పెద్దరెడ్డి, మిథున్ రెడ్డిలు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారన్న మరక ఉన్నందున మిథున్ రెడ్డి ఎంట్రీ విషయంలో బీజేపీ ముందువెనుకలాడుతోందని పరిశీలకులు అంటున్నారు. అవినీతి మరక ఉన్నప్పటికీ బీజేపీ ఎంట్రీకి అదేమంత అడ్డంకి కాదని గతంలో పలువురి విషయంలో రుజువైంది. అయితే మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కమలనాథులు కండీషన్లు పెట్టారనీ, అందుకే మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడటానికి కారణమంటున్నారు. ఇంతకీ బీజేపీ పెట్టిన కండీషన్స్ ఏమిటంటే.. మిథున్ రెడ్డి బీజేపీ గూటికి చేరిన తరువాత ఇక జగన్ తో ఎటువంటి సంబధాలూ ఉండకూడదు. లోపాయికారీ ఒప్పందాలేవీ చేసుకోకూడదు. ఈ కండీషన్స్ కారణంగానే మిథున్ రెడ్డి బీజేపీలో చేరికకు బ్రేక్ పడిందని అంటున్నారు. అంతే కాకుండా కేవలం మిథున్ రెడ్డి మాత్రమే కాకుండా ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులను కూడా తీసుకురావాలని బీజేపీ షరతు విధించిందనీ, అది కూడా మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీ జాప్యం కావడానికి కారణమంటున్నారు. ఇప్పటికే వైసీపీలో కొందరు సీనియర్లు.. సైలెంట్ మోడ్ లోకి వెళ్లి పోయారు. అలాంటి వారితో కలసి మిథున్ బీజేపీలోకి వస్తే.. ఏపీలో కూడా పార్టీ బలపడుతుంది. కాబట్టి.. అలా చేయగలిగితే తమకేం అభ్యంతరం లేదని కేంద్ర కమలనాయకత్వం భావిస్తోందట. దీంతో ఇటు మిథున్ తో పాటు అటు విజయసాయి కూడా ఇలాంటి కమలం బాట పట్టే వారి కోసం తీవ్రంగా యత్నిస్తున్నారట. దీంతో మిథున్ బీజేపీ ఎంట్రీకి జాప్యం అవుతోందనీ, బీజేపీ కండీషన్లన్నిటినీ నెరవేర్చి మిథున్ రెడ్డి బీజేపీకి వెళ్లేలోపు 2029 ఎన్నికలు కూడా వచ్చేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.
http://www.teluguone.com/news/content/reason-for-mithunredd-entry-into-bjp-39-212692.html




