హిందూపురంలో తక్కువ ఓటింగ్.. కారణమేంటో తెలుసా?
Publish Date:May 16, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసి మూడు రోజులైంది. రాష్ట్రంలో పోలింగ్ శాతం ఎంతన్నది అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 81.86శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2019 ఎన్నికలలో నమోదైన పోలింగ్ కంటే రెండు శాతం ఎక్కువ. సాధారణంగా అధిక ఓటింగ్ యాంటీఇంకంబెన్సీకి తార్కానమని రాజకీయ పండితులు చెబుతారు. ఫలితాలు కూడా అలాగే వస్తుంటాయి. ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర సగటు ఓటింగ్ కంటే కీలక నియోజకవర్గాలలో అధిక పోలింగ్ జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే తెలుగుదేశం అధినేత పోటీ చేసిన కుప్పంలో, వైసీపీ అధినేత పోటీ చేసిన పులివెందులలో, అలాగే జనసేనాని పోటీలో ఉన్న పిఠాపురంలో, తెలుగుదేశం జాతీయ కార్యదర్శి పోటీలో ఉన్న మంగళగిరిలో రాష్ట్ర సగటు కంటే అధిక పోలింగ్ నమోదైంది. అయితే హిందూపూర్ లో రాష్ట్ర సగటు కంటే పోలింగ్ తక్కువ నమోదు కావడానికి కారణం ఏమిటి? ఇక్కడ పరిస్థితి వైసీపీకి అనుకూలంగా ఏమైనా ఉందా అన్న సందేహాలు కొందరిలో వ్యక్తం అయ్యాయి. అయితే హిందూపుర్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ ఇక్కడ ఆ పార్టీ ఓడిపోయిన పరిస్థితి లేదు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన హిందూపూర్ నుంచి 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి వీచిన 2019 ఎన్నికలలో కూడా ఆయన ఘన విజయం సాధించారు. అంతే కాదు 2014 ఎన్నికలలో సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ సాధించారు. ఆ ఎన్నికలలో రాయలసీమ మొత్తంలో తెలుగుదేశం కేవలం మూడంటే మూడు స్థానాలలోనే విజయం సాధించింది. అంతే కాదు ఆ ఎన్నికలలో చంద్రబాబు మెజారిటీ కూడా భారీగా తగ్గింది. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా బాలకృష్ణకు హిందుపూర్ ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. మరి అటువంటిది అంతా సానుకూలంగా ఉన్న ఈ సమయంలో హిందుపూర్ లో ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడమేమిటన్న ప్రశ్నకు పరిశీలకులు హేతుబద్ధంగా ఇస్తున్న విశ్లేషణ ఏమిటంటే.. హిందుపూర్ లో వైసీపీ ప్రచారం సమయంలోనే కాడె వదిలేసింది. ఈ నియోజకవర్గంలో విజయంపై వైసీపీకి ఆశల్లేకపోవడంతో ఆ పార్టీ ప్రచారం కూడా పేలవంగా సాగింది. ఇక్కడ బాలకృష్ణ ప్రత్యర్థిగా దీపిక నిలబడ్డారు. నియోజకవర్గంలో ఆమె ప్రచారం అత్యంత పేలవంగా ఉంది. అంతే కాకుండా హిందుపూర్ నియోజకవర్గ వైసీపీలో గ్రూపు విబేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఆ పార్టీ నేతల మధ్య ఐక్యత లేదు. తన విజయం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్న బాలకృష్ణ హిందూపూర్ తో పాటు కూటమి అభ్యర్థుల విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఇక షెడ్యూల్ ప్రకటనకు ముందు వెలువడిన దాదాపు డజనుకు పైగా సర్వేలన్నీ కూడా హిందూపూర్ లో బాలకృష్ణ విజయం నల్లేరు మీద బండినడకేనని పేర్కొన్నాయి. ఇక పోల్ మేనేజ్ మెంట్ విషయంలో కూడా హిందుపూర్ లో వైసీపీ ఘోరంగా విఫలమైంది. ఓటర్లను పోలింగ్ బూత్ లకు తీసుకువచ్చే ప్రయత్నం కూడా ఆ పార్టీ చేయలేదు. ఇక పోలింగ్ శాతం తక్కువగా ఉండడానికి హిందూపురం అర్బన్ ఓటర్లు పోలింగ్ బూత్ లకు రాలేదనీ, అలాగే ఇక్కడ నుంచి వలస వెళ్లిన వారికి ఓటింగ్ కు వచ్చేలా చేయడానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదనీ అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విజయంపై ధీమా ఉండటంతో తెలుగుదేశం పార్టీ కూడా వలస వెళ్లిన వారిని రప్పించేందుకు పెద్దగా కృషి చేయలేదని అంటున్నారు. హిందుపూర్ లో బాలయ్య పై ఎలాంటి వ్యతిరేకతా లేకపోవడం వల్లనే ఓటింగ్ శాతం పెరగలేదనీ, పడిన ఓటంతా సానుకూల ఓటేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే ఆశ్చర్యకరంగా నందమూరి బాలకృష్ణ పోటీ చేసిన హిందుపూర్ నియోజకవర్గంలో మాత్రం ఓటింగ్ తగ్గింది. హిందూపూర్ లో ఈ సారి 77.82 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2019 ఎన్నికలలో నమోదైన పోలంగ్ కంటే కూడా స్వల్పంగా తక్కువ. దీంతో హిందూపూర్ లో తక్కువ ఓటింగ్ నమోదు కావడానికి కారణాలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇక్కడ నుంచి 2014, 2019 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణ విజయం సాధించారు. ఈ సారి ముచ్చటగా మూడో సారి కూడా విజయకేతం ఎగురవేసి హ్యాట్రిక్ కొట్టాలన్న ఉత్సాహంతో ఉన్నారు.
http://www.teluguone.com/news/content/reason-for-low-voting-in-hindupur-39-176121.html