దేశాన్ని ఏలతామన్న కేసీఆర్..మౌనమేలనోయీ?
Publish Date:Jul 23, 2023
Advertisement
దేశ పరిస్థితులు చూసిన తర్వాత మార్పు కోసం ఇక కొట్లాడాల్సిందేనని నిర్ణయించుకున్నా.. 75 ఏండ్ల స్వాతంత్య దేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. ఎందరో నేతలు ఎన్నో మాటలు చెప్పారు.. కానీ మార్పు లేదు.. అందుకే దేశంలో భారీ మార్పు తేవాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకున్నా.. ఎన్నాళ్లో ఎదురు చూశాం ఎవరైనా వస్తారేమోనని.. కానీ రాలే. ఇక ఇప్పుడు సమయం వచ్చింది.. అందుకే నేను వచ్చా.. ఎన్నికల్లో గెలవాల్సింది నేతలు కాదు.. ప్రజలు. ప్రజలను గెలిపించాలనే టీఆర్ఎస్ ను.. బీఆర్ఎస్ గా మార్చా. ఇదీ మహారాష్ట్ర నాందేడ్ లో నిర్వహించిన బీఆర్ఎస్ తొలి సభలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడిన మాటలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇన్నాళ్లు దేశాన్ని పాలించిన వాళ్లంతా చేతగాని వాళ్ళు, వాళ్ళు చెప్పినవన్నీ ఫాల్తూ మాటలే.. మాయ చేసి మతలబు చేసి ప్రజలను పీడించుకు తింటున్నారు.. అందుకే తెలంగాణ మాదిరి దేశాన్ని కూడా సస్యశ్యామలం చేయాలనే తాను జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టాను. కేసీఆర్ నాందేడ్ సభలో నాడు మాట్లాడిన మాటల సారాంశమిదే. దీని కోసం దేశమంతా కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతానని.. దేశంలో అన్ని పార్టీలనూ ఏకం చేస్తానని.. తద్వారా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానని సీఎం, అందుకే నడుంబిగించాననీ కేసీఆర్ చెప్పారు. చెప్పినట్లే ఒకసారి కర్ణాటక, మరోసారి తమిళనాడు, ఇంకోసారి బిహార్, యూపీ వంటి రాష్ట్రాలకు వెళ్లి.. అక్కడి ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపి.. వారితో చేతులు కలిపి అందరినీ ఏకం చేస్తున్నానని సిగ్నల్స్ ఇచ్చారు. ఎక్కడకి వెళ్లినా ప్రధాని మోడీపై ఒంటికాలిపై లేచిన కేసీఆర్.. అప్పుడప్పుడూ కాంగ్రెస్ మీద కూడా కారాలూ మిరియాలూ నూరుతూ వచ్చారు. దేశ జీడీపీ నుంచి చైనా ఆగడాల వరకు.. అభివృద్ధి నుంచి అప్పుల వరకు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. అసలు మనల్ని పాలించేందుకు వీళ్ళెవరూ.. వాళ్ళెవరూ.. మనల్ని మనమే పాలించుకుందాం.. బీజేపీ, కాంగ్రెస్ లేని భారత ప్రభుత్వాన్ని నిర్మిద్దామని మైకులు పగిలేలా ప్రసంగాలు చేశారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఇండియా’ ఏర్పాటయ్యాయి. 28 రాజకీయాల పార్టీలతో ఇండియా, 36 రాజకీయ పార్టీలతో ఎన్డీయే సమావేశాలు కూడా జరిగిపోయాయి. ఈ రెండు గ్రూపులలోనే కేసీఆర్ కలిసి వచ్చిన పార్టీలు కూడా ఉన్నాయి. ఈ రెండు కూటములు పోగా దేశవ్యాప్తంగా మిగిలింది ఏడెనిమిది పార్టీలు మాత్రమే. ఇందులో కూడా కొన్ని ఎన్నికల నాటికి ఏదో ఒక కూటమికి చేరనున్నాయి. అలా మొత్తంగా చూస్తే కేసీఆర్ ఒంటరైపోయారు. దీంతో దేశాన్ని ఏలతానన్న నోరు అసలు పెగలడం లేదు. మోడీని గద్దె దించుతానన్న శపథం కాళేశ్వరంలో కలిపేశారా అన్న అనుమానాలు సొంత పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమౌతున్నాయి. దేశంలో మార్పు సంగతెలా ఉన్నా.. రాష్ట్రంలో రోజురోజుకీ బలీయంగా మారుతున్న కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మారకుండా చూసుకోవడమే ఇప్పుడు కేసీఆర్ వంతైంది. దేశాన్ని ఏలతానని బయల్దేరిన కేసీఆర్ ఇప్పుడు అసలు దేశంలో జరిగే వాటిని కూడా పట్టించుకోవడం మానేసినట్లుగా కనిపిస్తుంది. మణిపూర్ వంటి చిన్న రాష్ట్రం తగలబడిపోతున్నదని, గిరిజనులపై దారుణ మారణాలు జరుగుతున్నాయని దేశం మొత్తం గగ్గోలు పెడుతున్నా.. కేసీఆర్ ఎక్కడా స్పందించలేదు. దేశంలో రాజకీయంగా ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎక్కడా పెదవి విప్పడం లేదు. నిన్నగాక మొన్న మహారాష్ట్రకి భారీ కాన్వాయ్ తో వెళ్లిన కేసీఆర్, ఆ తర్వాత మరే ఇతర రాష్ట్రం గురించి మాట్లాడడం లేదు. పొరుగున తెలుగు రాష్ట్రమైన ఏపీలో పాగా వేస్తామని పలికిన ప్రగల్భాలు ఇప్పుడు మొత్తానికి మర్చేపోయినట్లు ఉన్నారు.
http://www.teluguone.com/news/content/reason-behind-kcrsilense-25-158862.html





