వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ.. రైతులకు శుభవార్త
Publish Date:Feb 7, 2019
Advertisement
ఆర్థికవేత్తలు, పారిశ్రామిక వర్గాల అంచనాలకు తగినట్టుగానే భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) ఇవాళ శుభవార్త చెప్పింది. 17 నెలల తర్వాత ఎట్టకేలకు కీలక వడ్డీరేట్ల తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో కీలక వడ్డీరేట్లలో పావుశాతం కోత విధించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షతన ఇవాళ జరిగిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. మూడు రోజుల పాటు జరిగిన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ నేడు ప్రకటించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇప్పుడు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగివచ్చింది. రివర్స్ రెపోరేటును సైతం 6 శాతంగానూ, బ్యాంకు రేటును 6.5శాతంగానూ నిర్ణయించారు. ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన తొలి ద్రవ్య విధాన సమీక్ష ఇదే కావడం మరో విశేషం. ఆగస్టు 2017లో చివరిసారి వడ్డీరేట్లను తగ్గించారు. తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలతో గృహ, వాహన రుణాలు మరింత చౌకగా లభించే అవకాశాలున్నట్టు ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. కాగా జీడీపీ వృద్ధి లక్ష్యాన్ని మాత్రం ఆర్బీఐ యథాతథంగా 7.4 శాతంగానే ఉంచింది. ద్రవ్యోల్బణం జనవరి-మార్చి మధ్య 2.4 శాతంగానూ, ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 3.2-3.4 శాతంగానూ ఉంటుందని అంచనా వేసింది. రైతుల సంక్షేమం కోసం ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో సరికొత్త పథకం తీసుకొచ్చారు. పేద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000 అందజేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. తాజాగా ఆర్బీఐ కూడా రైతులకు మరో కానుక అందిస్తోంది. హామీ అవసరం లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 1.60లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ‘ద్రవ్యోల్బణం, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి హామీ లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.6లక్షల వరకు పెంచుతున్నాం. చిన్న, సన్నకారు రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని ఆర్‌బీఐ పేర్కొంది. దీనిపై త్వరలోనే అన్ని బ్యాంకులకు నోటీసు జారీ చేయనుంది.
http://www.teluguone.com/news/content/rbi-cuts-key-repo-rate-by-25-basis-points-39-85750.html





