Jr NTR కార్యాలయం కీలక ప్రకటన..!
Publish Date:Jul 14, 2026
Advertisement
నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ 'RAW NTR (రా-ఎన్టీఆర్)' పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు సంస్థను నిర్వహిస్తూ, అది ఎన్టీఆర్ అధికారిక సంస్థ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతు న్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసి, ఆ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. ఈ నెల 18 నుంచి ఎన్టీఆర్ ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగు తున్న 'ఊరు-వాడ' సేవా కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని, రా-ఎన్టీఆర్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసిన నిర్వాహకులు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం పూర్తిగా తమ ఆధ్వర్యంలో జరుగుతోందని, ఎన్టీఆర్ ప్రజాసేవ కోసం రూ.100 కోట్ల వ్యయంతో దీన్ని చేపడుతున్నారని, రాజకీయ అరంగేట్రంలో భాగంగానే ఈ కార్యక్రమం ప్రారంభమవుతోందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై పలు ఫిర్యాదులు అందడంతో స్పందించిన ఎన్టీఆర్ కార్యాలయం, రా-ఎన్టీఆర్ అనే సంస్థకు, దాని కార్యకలాపాలకు, నిర్వాహకులకు తమతో ఎలాంటి అనుబంధం లేదని స్పష్టం చేసింది. ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతి నిధ్యం వహించే అధికారం లేదని, ఆయన పేరుతో ఎలాంటి అధికారిక ప్రకటనలు చేసే హక్కు కూడా లేదని వెల్లడించింది. అలాగే, ఎన్టీఆర్‌కు సంబంధించిన ఏ సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం లేదా అధికారిక సమాచారం అయినా ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం ద్వారానే వెల్లడిస్తామని, అనధికార వ్యక్తులు లేదా సంస్థలు చేసే ప్రచారాన్ని నమ్మవద్దని కార్యాలయం ప్రజలకు, అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై ఇదే తమ చివరి ప్రకటన అని పేర్కొన్న ఎన్టీఆర్ కార్యాలయం, మీడియా, సోషల్ మీడియా వేదికలు, అభిమానులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా, పుకార్లను విశ్వసించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. ఈ ప్రకటనతో 'రా-ఎన్టీఆర్' పేరుతో జరుగుతున్న ప్రచారానికి ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా స్పష్టత వచ్చినట్లైంది.
http://www.teluguone.com/news/content/raw-ntr-36-225974.html





