వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ దూసుకెళ్లండి.. ఎపి బీజేపీకి రామ్ మాధవ్ దిశా నిర్దేశం
Publish Date:Aug 31, 2019
Advertisement
ఏపీలో బీజేపీ బలపడేలా రాష్ట్ర బీజేపీ నాయకులు సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ దూసుకెళ్లాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రామ్ మాధవ్ కార్యకర్తలతో మాట్లాడుతూ పోలవరం, రాజధాని విషయాల్లో ముందుకే వెళ్లాలని సూచించారు. పోలవరంపై పీపీఏ ఇచ్చిన నివేదికకు కట్టుబడి ఉండాలని, అలాగే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, అమరావతిలో నిర్మాణాలను కొనసాగించేలా జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సమావేశంలో తీర్మానించారు. గత టీడీపీ ప్రభుత్వం తప్పులు చేస్తే శిక్షించాలి కానీ ఆ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు నిలిపివేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. బీజేపీలో భిన్న అభిప్రాయాలు ఉండకూడదని అందరు ఒకే నిర్ణయంతో అంతా ముందుకు వెళ్లి పార్టీని బలోపేతం చేయాలనీ తీర్మానించారు. ఏపీలో టీడీపీ వైసీపీలకు బీజేపీ సమదూరం పాటించాలని సమావేశంలో తీర్మానించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే వైసీపీపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. వైసిపి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎక్కడికక్కడ ఎండగట్టాల్సిందేనని, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తప్పులనూ వదలొద్దని ప్రజల్లో తీవ్రంగా విమర్శించాలని ఈ సమావేశం లో నిర్ణయించారు.
http://www.teluguone.com/news/content/ram-madhav-advises-bjp-cadre-to-target-both-jagan-and-babu-39-89005.html





