మోదీకి నేవి ఆఫీసర్ కౌంటర్.. అది ఫ్యామిలీ ట్రిప్ కాదు
Publish Date:May 10, 2019
Advertisement
ఎన్నికల వేళ ప్రధాని మోదీ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ అవినీతిలో నెంబర్ వన్ అంటూ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మోదీపై విమర్శలు వెల్లువెత్తాయి. మోదీ వ్యాఖ్యలను పలువురు తప్పుపట్టారు. అయినా మోదీ మాత్రం తన తీరు మార్చుకోవట్లేదు. ఇటీవల మోదీ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్ నౌకలో పార్టీ చేసుకొన్నారని ఆరోపిస్తూ మరో వివాదానికి తెరలేపారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. రాజీవ్ పార్టీ కోసం నౌకను వినియోగించలేదని మాజీ కమాండింగ్ ఆఫీసర్ చెప్పడం కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది. రాజీవ్, అతని స్నేహితులు, అత్త, సోనియా తదితరులు ఐఎన్ఎస్ విరాట్‌లో విహరించారని మోదీ ఆరోపించారు. పార్టీల కోసం వినియోగించారని కామెంట్స్ చేశారు. అంతేకాదు అమితాబ్ బచ్చన్ కుటుంబం కూడా ఉందని ఆరోపించారు. అయితే మోదీ వ్యాఖ్యలను.. 1987 నాటి విరాట్ కమాండెంట్ ఆఫీసర్ వైస్ అడ్మిరల్ వినోద్ ఖండించారు. ప్రధాని మోదీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజీవ్ లక్ష్వదీవులకు అధికార కార్యక్రమం కోసం వెళ్లారని గుర్తుచేశారు. ద్వీపంలో అక్కడి అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు తప్ప .. అది ఫ్యామిలీ హాలీడే కాదని స్పష్టంచేశారు. ఆయనతో పాటు భార్య సోనియా, కుమారుడు రాహుల్, ఇతర అధికారులు కూడా ఉన్నారని.. విధుల్లో నిమగ్నమైన రాజీవ్ తో భార్య, పిల్లలు ఉండొద్దా అని ప్రశ్నించారాయన. అయితే అమితాబ్ బచ్చన్ కుటుంబం కూడా ఉందనే వాదను తప్పుపట్టారు. రాహుల్, సోనియా, ఐఏఎస్ అధికారులు తప్ప మరొకరు లేరని కుండబద్దలు కొట్టారు. ఇలాంటి రాజకీయాలను నేవి ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోదని స్పష్టంచేశారు.
http://www.teluguone.com/news/content/rajiv-gandhi-didnt-use-ins-viraat-for-vacation-says-former-navy-officer-39-86912.html





