రజనీ.. బాండ్.. లేడీ బాండ్.!
Publish Date:Jun 20, 2022
Advertisement
మగాళ్లలా డ్రస్ చేసుకుని చేతిలో పిస్టల్ తో మరో ఇద్దరు ముగ్గురితో కలిసి ఒక మహిళ దొంగల ముఠా ఛేజింగ్ లో గుట్టలు, పుట్టలూ అమాంతం దూకేస్తూంటుంది.. ధడాల్న పిస్టల్ కూడా కాల్చి గోడ దూకి పారి పోతున్నవాడిని అమాంతం కిందపడేలా చేస్తుంది.. ఇదంతా టీవీల్లో వచ్చే క్రైమ్ సీరియల్ సీన్.. ఇది చూస్తూన్న ఓ తల్లి అమ్మాయిలు చేస్తారటే ఇలాగూ అంటుంది కూతురితో. ఏ ఎందుకు చేయరు? పవర్ స్టారే చేయాలా? నిజంగా కూడా ఇలా పోలీసు వుద్యోగాలు చేసేవాళ్లున్నారు అంది ఇప్పటి అమ్మాయి! అవును ఈ రోజుల్లో నిజంగానే మహిళలు పోలీస్ అధికారులే కాదు ఏకంగా డిటెక్టివ్‌గానూ పనిచేస్తూ ఎన్నో కేసులు పరిష్కరించిన దిట్టలూ వున్నారు. వారందరిలో టాప్. ఒకటీ రెండు కాదు ఏకంగా 80 వేల కేసులు పరిష్కరించిన లేడీ బాండ్ రజనీ పండిట్! ఈ దేశీ షెర్లాక్ హోమ్స్ తన 22 ఏళ్ల కెరీర్‌లో పెద్ద పెద్ద గూండాలని హడలెత్తించింది. ముంబై విశ్వవిద్యా లయంలో మరాఠీ సాహిత్యంలో డిగ్రీ పొందింది. కానీ చాలామందిలా ఏ టీచర్‌గానో, లెక్చరర్‌గానో వెళి పోలేదు. ఎందుకంటే ఆమెకు చిన్నప్పటి నుంచి డిటెక్టివ్ నవలల పిచ్చి బాగా వుండేదిట. తాను అలా డిటెక్టివ్ కావాలని వుండేది. పైగా ఆమె తండ్రి పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ కావడంతో సహజంగానే ఆ డిపార్ట్ మెంట్ ప్రభావం రవ్వంతయినా పడి వుంటుంది. ఇందుకు కాలేజీలోనే ఒక అమ్మాయి విషయంలో పరిశోధన చేయడంతో ఆ రంగంలోకి వెళ్లాలన్న పట్టుదల బాగా పెరిగింది. తన క్లాస్‌మేట్స్‌లో ఒక అమ్మాయి వ్యభిచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తోందని అనుమానించింది. ఒక రోజు ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పింది. కానీ వారు నమ్మలేదు. తర్వాత రహస్యంగా కెమెరా పట్టి ఆ అమ్మాయిని వెన్నంటి ఫోటోలు తీసింది. అవి చూసి నిర్ఘాంతపోయారు ఆ పిల్ల తల్లిదండ్రులు. చదువు పూర్తికాగానే తను ఛేదించిన చిన్న కేసుతో గట్టి నమ్మకం కుదిరి రజనీ ఏకంగా 1983లో డిటెక్టివ్ సర్వీస్‌ను ఆరంభించింది. అప్పటికి ఆమె వయసు 25 ఏళ్లే! మగవాళ్లు దూసుకుపోతున్న ఆ రంగంలోకి వెళ్లడానికి రజనీ చూపిన సాహసం, చొరవా అనన్యసామాన్యం. క్రమేపీ ఆమె ఏజెన్సీ అందరి దృష్టిలో పడింది. ఇంట్లో పనిమనిషి, బజార్లో కూరలు అమ్మేవారు, ఒక గర్భిణీ మహిళ కేసులు పరిష్కరించడంతో రజనీ పేరు మారుమోగింది. అందరికీ ఆమె పట్ల నమ్మకం కలిగింది. వూహించని విధంగా ఒక హత్య కేసు పరిశోధించాల్సి వచ్చింది. తండ్రీ కొడుకుల హత్య కేసు. అందులో సాక్ష్యాలూ లేవు. అయితే ఈ కేసులో అనుమానితురాలిగా వున్న ఒక మహిళ ఇంట్లో పనిమనిషిగా రజనీ మారువేషంలో వెళ్లింది. ఆమె పనిచేస్తు న్న రోజుల్లోనే ఒకరోజు ఆమె యజమాని వద్దకు ఒకడు వచ్చేడు. వాడు సుపారీ హంతకుడు. ఆ సమయం లో రజని కావాలని తన పాదాన్ని కత్తితో గాటు చేసుకుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లి వస్తానని పర్మిషన్ అడిగి బయటపడింది. పరుగున దగ్గరలోని ఎస్‌టీడీ బూత్‌కి వెళ్లి తన క్లయింట్‌కి ఫోన్ చేసి పోలీసులను తీసుకు రమ్మని చెప్పింది. అంతే కొద్దిసేపటి తర్వాత పోలీసులు సుపారీ హంతకుడిని, ఆమె స్నేహితురాలిని పట్టుకున్నారు. డిటెక్టివ్‌గా తన కెరీర్‌ను కొనసాగించి ఎందరికో సహాయసహకారాలు అందించింది రజని. ఆమె తన వృత్తి కి ఎంతగా అంకితమయ్యారంటే ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు! అసలు తనకు వివాహం చేసుకుని కుటుంబాన్ని పోషిస్తూ గడపడం పట్ల పెద్దగా ఆసక్తి లేదని ఒకసారి అన్నారు. సమాజసేవలోనే తనకు ఎంతో ఆనందం వుందని సమాజంలో దుర్మార్గం, దారుణాలను అరికట్టడం కంటే గొప్ప పని మరోటి వుం టుందా అని తనను ప్రశ్నించేవారికి సమాధానంగా చెబుతుంటారు. రజనీ పాటిల్ వలె దేశంలో మహిళలు పోలీసు రంగంలోకి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆసక్తి లేని వారు ఆమె సాహసోపేత చరిత్ర గురించి తెలుసుకుని ఆమె నుంచీ ఎంతో స్ఫూర్తి పొందుతున్నారు. కానీ ఈ రోజుల్లో రజనీ వంటి సాహసిగా అందరూ వుండాలన్నది ఆమె కెరీర్ ఇచ్చే గొప్ప సందేశం!
http://www.teluguone.com/news/content/rajani-dare-and-dashing-lady-detective-25-138060.html





