చౌకీదార్ ఛోర్ హై.. ఆ ఉగ్రవాదిని విడుదల చేసింది బీజేపీనే
Publish Date:May 4, 2019
Advertisement
మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని, ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ, మోదీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జీఎస్టీతో చిన్న వ్యాపార సంస్థలు కుదేలయ్యాయన్నారు. నోట్ల రద్దు లాంటి అనాలోచిత నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మోదీ.. అధికారంలోకి వచ్చిన తరవాత ఆ ఊసే ఎత్తలేదన్నారు. తనతో చర్చకు ఎన్నిసార్లు ఆహ్వానించినా.. మోదీకి అందుకు సమయమే లభించడం లేదని విమర్శించారు. అవినీతి, నిరుద్యోగం, రైతాంగ సంక్షోభంపై చర్చించడానికి కేవలం 10 నిమిషాలు కేటాయించాలని.. అందుకు అనిల్ అంబానీ ఇంట్లో కాకుండా వేదిక ఎక్కడ ఏర్పాటు చేసినా తాను సిద్ధమేనన్నారు. ఐదేళ్ల పాలనలో మోదీ ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. యూపీఏ హాయాంలో జరిగిన సర్జికల్ దాడులపై మోదీ సందేహాలు వ్యక్తం చేయడం.. సైన్యాన్ని అవమానించడమేనంటూ రాహుల్ విరుచుకుపడ్డారు. ‘‘నరేంద్రమోదీ అనుకుంటున్నట్టు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఎవరి సొత్తూ కాదు. యూపీఏ హయాంలో జరిగిన సర్జికల్ దాడులు వీడియో గేమ్‌లలో జరిగాయని ప్రధాని చెప్పారంటే, అది కాంగ్రెస్‌ను అవమానం కాదు.. సైనిక దళాలను అవమానించినట్టు. ఈ వైమానిక దాడులు చేసింది సైన్యం. అయితే మేము సైన్యానికి రాజకీయాలు ఆపాదించలేదు. ప్రధాని ఈ విధంగా సైన్యాన్ని అవమానించకూడదు..’’ అని హితవు పలికారు. అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్‌పై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఉగ్రవాదానికి తలొగ్గి అతణ్ని విడుదల చేసింది బీజేపీ ప్రభుత్వమే అని రాహుల్ గుర్తుచేశారు. ‘చౌకీదార్ ఛోర్ హై’ అన్న వ్యాఖ్యలపై చెలరేగిన దుమారాన్ని ప్రస్తావిస్తూ.. సుప్రీంకోర్టుకు ఆపాదిస్తూ చేసిన వ్యాఖ్యలకు మాత్రమే తాను క్షమాపణలు చెప్పానని.. మోదీకో లేదా బీజేపీకో కాదని రాహుల్ వివరించారు. అలాగే ‘చౌకీదార్ ఛోర్ హై’ అన్న నినాదం మాత్రం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో నాయకులు రూపొందించిన పత్రం కాదని.. అది ప్రజల గళాన్ని వినిపిస్తోందని వ్యాఖ్యానించారు.
http://www.teluguone.com/news/content/rahul-gandhi-slams-pm-modi-for-politics-over-surgical-strikes-39-86842.html





