ఈ ఫలితాలు కూడా ఆ లెగ్గు మహత్యమేనట!
Publish Date:Dec 8, 2013
Advertisement
దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, అందుకు పార్టీని తప్పుపట్టకుండా,అది అభం శుభం తెలియని రాహుల్ గాంధీ ‘ఐరన్ లెగ్’ మహత్యమేనని జనాలు అవాకులు చవాకులు వాగుతుంటారు. ఏమంటే ఆయన బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పార్టీకి మంగళ హారతి ఇచ్చేయలేదా? గుజరాత్ లో పార్టీని పక్కనున్న అరేబియా సముద్రంలో ముంచేయలేదా? అంటూ ఏవో చెత్త చెత్త రికార్డులన్నీ తిరగేసి చూపుతుంటారు. కానీ, ఏ ఒక్కరూ కూడా ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో ఏవిధంగా గెలిపించారో మాత్రం ప్రస్తావించరు. ఒకవేళ ఈ పామర జనాలకి అది గుర్తు చేసి ఆయన గొప్పదనం గురించి చెప్పబోయినా, “ఆ..అక్కడ గనుల గాలి జనార్ధన్ రెడ్డి, ఎడ్యురప్పల దెబ్బకి బీజేపీ ఓడిపోయిందని కానీ అదేమి ఆయన గొప్పదనం కాదని వితండ వాదనలు చేస్తారు. మరి ‘ఐరెన్ లెగ్గు.. ఐరెన్ లెగ్గు’ అని వెక్కిరించేవారు మరి కర్ణాటకలో ఆ లెగ్గు మహత్యం ఎందుకు కనబడలేదో చెప్పమంటే మాత్రం జవాబు చెప్పరు. కానీ “ఇదిగో ఇప్పుడు చూసారు కదా... నాలుగు రాష్ట్రాలలో లెగ్గు మహత్యం. ఆయన అడుగుపెట్టిన రాష్ట్రాలలో ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలోనయినా కాంగ్రెస్ గెలిచిందా?” అని ఎదురు ప్రశ్నిస్తారు. “సరే! ఆయన లెగ్గుకే నిజంగా అంత మహత్యం ఉంటే మరి నిత్యం ఆయన పాదదూళితో పునీతమయిపోతున్నడిల్లీలో కాంగ్రెస్ పార్టీ గత 15సం.లుగా గెలుస్తూనే ఉంది కదా?” అని ప్రశ్నిస్తే, ఒక వెర్రి నవ్వు నవ్వి “చరిత్రలొద్దు..చెప్పింది విను” అంటూ 125సం.ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని నిన్నగాక మొన్న పుట్టిన ఒక అమ్ ఆద్మీ చీపురు పట్టుకొని బయటకి ఊడ్చిపడేసినా ఇంకా లెగ్గు మహత్యం అర్ధం కాకపోతే నీకీ రాజకీయాలేందుకు ఈ చర్చలు ఎందుకు?” అంటూ నిలదీస్తారు. అంతే తప్ప పాపం అభం శుభం తెలియని ఆ రాహుల్ బాబు లెగ్గుకి నిజంగా అంత పవర్ లేదంటే ఎవరూ వినిపించుకోరు, కనీసం నమ్మను కూడా నమ్మరు. పైగా “ఇప్పుడే ఏమి చూసారు? 2014ఎన్నికలలో బాబు లెగ్గు మహత్యం మీరే చూద్దురు గాని” అంటూ వెర్రి వెర్రి కూతలు కూస్తుంటారు. “ప్రస్తుతం తెలుగు గడ్డకి ఆయన లెగ్గు సోకే భాగ్యం లేకపోయినా, కాంగ్రెస్ నేతలు తమ శిరస్సున పూసుకోస్తున్న ఆయన పాదధూళి తగిలినంత మాత్రాన్నేఎన్నికలకు ఇంకా ఆరు నెలల ముందే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎలా ఊడ్చుకుపోతోందో చూసారా?” అని వెక్కిరింపు ఒకటీ. ఇక ఆయన ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలో అడుగుపెట్టకబోతారా? మేము గెలవక పోతామా? అని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఆయన మీదే గంపెడు ఆశలు పెట్టుకొని ఆయన పాదధూళి కోసం అహల్యా దేవిలా ఎదురుచూస్తున్నాయి. అయినా వచ్చేఎన్నికల తరువాత ఆయన ప్రధాని కుర్చీలో లెగ్గు మీద లెగ్గేసుకొని కూర్చొని దేశాన్నిపాలించేస్తుంటే చూడాలని సాక్షాత్ సోనియమ్మ, మన్మొహనులవారే ముచ్చట పడుతుంటే కాదనేనుందుకు ఈ వెర్రి జనాలెవరు? కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాకపోయినా ఆంధ్రప్రదేశ్ నుండి డిల్లీ వరకు ఈ వీహెచ్, సర్వే,బొత్స,డీయస్, జానా వంటి అనేక మంది కాంగ్రెస్ నేతలున్నారు. వారందరూ ఎప్పుడూ రాహుల్, సోనియా అంటూ నిత్య పారాయణం, భజనలు చేయడమే తప్ప, వారిలో ఒక్కరు కూడా పాపం రాహుల్ బాబు లెగ్గు దోషం (మహత్యం) పోవడానికి చొరవ తీసుకొని ఏ రాహుకేతు పూజలో, నవగ్రహ పూజలో ఎప్పుడయినా చేసారా? అని పామర జనాలు నిలదీస్తున్నారు. అందుకే వారు ఏ మహాత్యమూ లేని పామరులయ్యారని జాలిపడటం తప్ప ఎవరు మాత్రం ఏమి చేయగలరు? అయినా ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఈ వెర్రి జనాలు ఆయన గురించి ఎన్ని అవాకులు చవాకులు వాగినా ఆయన లెగ్గు చాలా పవర్ ఫుల్ లెగ్ అని చచ్చినట్లు ఒప్పుకొంటున్నారు.
http://www.teluguone.com/news/content/rahul-gandhi-39-28199.html





