2 స్టేట్స్.. సేమ్ రివేంజ్ పాలిటిక్స్.. ఇద్దరు మొనగాళ్లు..
Publish Date:May 20, 2021
Advertisement
రఘురామ కృష్ణరాజు. వైసీపీ సభ్యులు. నర్సాపురం ఎంపీ. ఈటల రాజేందర్. టీఆర్ఎస్ సభ్యులు. హుజురాబాద్ ఎమ్మెల్యే.ఇద్దరూ ఇద్దరే. ఎవరి స్థాయిలో వారు మంచి నాయకులే. వారిరువురూ స్వపక్షంలో విపక్షంగా మారారు. బాస్‌లకు పక్కలో బల్లెంలా మారారు. అందుకే, సొంత పార్టీలకే టార్గెట్ అయ్యారు. ఏ పార్టీ నుంచి అయితే ఎన్నికయ్యారో.. అదే పార్టీ నుంచి ముప్పు ఎదుర్కొంటున్నారు. ఏ అధినేతలకైతే వాళ్లు జై కొట్టారో.. ఇప్పుడు అదే అధినేతలు వాళ్లను ఏకాకులను చేసి.. కేసుల్లో ఇరికించి.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఏపీలో రఘురామ, తెలంగాణలో ఈటల టార్గెట్‌గా రాజకీయం రంజుగా సాగుతోంది. రఘురామకృష్ణరాజు. జగన్ టికెట్ ఇస్తే వైసీపీ తరఫున నర్సాపురం ఎంపీగా గెలిచారు. జగన్ సీఎం అయ్యాక.. ఆయన అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సహించలేకపోయారు. అందుకే, ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రివి తప్పుడు నిర్ణయాలంటూ తూర్పారబడుతూ వచ్చారు. అంతే. తప్పును తప్పని చెబితే జగన్ తట్టుకోలేకపోయారు. తన పార్టీ నేతలను రఘురామపై ఉసిగొల్పారు. అప్పటి నుంచి ఏపీలో జగన్ వర్సెస్ రఘురామ, వైసీపీ వర్సెస్ ఆర్ఆర్ఆర్.. ఎపిసోడ్ వాడి-వేడిగా సాగింది. ప్రాణభీతితో కేంద్రం నుంచి తెచ్చుకున్న సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ రక్షణతో.. కొన్నాళ్లుగా ఢిల్లీలో సురక్షితంగా ఉంటూ వచ్చారు రఘురామ. సేమ్ టూ సేమ్.. తెలంగాణలోనూ అంతే. ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఉద్యమం కాడినుంచి కేసీఆర్ వెంట ఉన్న నాయకుడు. అందుకే, ఆయన తాను గులాబీ జెండకు బానిసలం కాదు.. ఓనర్లం అంటూ రెబెల్ జెండా ఎగరేశారు. ఆత్మాభిమానం కోసం అధినేతకు దూరమయ్యారు. పార్టీ, ప్రభుత్వ అంతర్గత విషయాలు బయటకు లీక్ చేస్తున్నారని.. వేరే పార్టీలతో టచ్‌లో ఉన్నారనే అనుమానంతో.. ఈటలను చాలా రోజులుగా దూరం పెట్టారు కేసీఆర్. కట్ చేస్తే.. గత శుక్రవారం తన బర్త్‌డే సందర్భంగా అనుకోకుండా హైదరాబాద్ వచ్చారు ఎంపీ రఘురామ. దొరికింది ఛాన్స్ అంటూ రఘురామ ఇంటిపై దాడి చేశారు ఏపీ సీఐడీ పోలీసులు. ఆయన్ను అరెస్ట్ చేసి.. గుంటూరుకు తీసుకెళ్లడం.. ఆయన కోర్టులకెళ్లడం.. తన కొట్టారంటూ ఫిర్యాదు చేయడం.. ఎంపీని జైలుకు తరలించడం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చేరడం.. కోర్టు ఉల్లంఘనపై ఏపీ సర్కారుకు హైకోర్టు నోటీసులు ఇవ్వడం.. ఇలా వేగంగా పరిణామాలు మారుతూ వచ్చాయి. తెలంగాణలోనూ అంతే. ఉన్నట్టుండి మంత్రి ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడం.. వెంటనే విచారణ కమిటీ వేయడం.. గంటల వ్యవధిలోనే నివేదిక రావడం.. రాత్రికి రాత్రే ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం.. ఇలా 20 ఏళ్ల పాటు టీఆర్ఎస్లో కేసీఆర్ వెంట ఉన్న నేతను.. ఒక్కరోజులోనే.. అవినీతిపరుడిగా, పార్టీ ద్రోహిగా ముద్రేసి.. పక్కన పెట్టడం కేసీఆర్ తరహా కంత్రీ పాలి..ట్రిక్స్‌కు నిదర్శనం. ఏపీ ప్రభుత్వంపై రఘురామా గట్టిగా పోరాడుతున్నారు. తనను అంతలా ఇబ్బందిపెట్టినా.. తలవంచకుండా తుదకంటూ ఫైట్ చేస్తున్నారు. మెజిస్ట్రేట్ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రఘురామ కుటుంబ సభ్యులు పార్లమెంట్ స్పీకర్‌ను కలిసి అరెస్ట్‌పై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం మాత్రం రఘురామను ఏకాకి చేసే ప్రయత్నం చేస్తోంది. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని నేతలంతా మీటింగ్‌లు పెట్టించి.. తమకు రఘురామకు ఎలాంటి సంబంధం లేదని చెప్పించింది. అటు, పశ్చిమ గోదావరిలో క్షత్రియ సేవా సమితి సైతం సమావేశమై రఘురామకు తమ మద్దతు ఉండదని ప్రకటించింది. అంతా దూరమైనా.. అందరి నుంచి దూరం చేసి.. రఘురామను ఏకాకి చేసే మరింత కార్నర్ చేసేలా సర్కారు చర్యలు ఉన్నాయి. ఈటల విషయంలోనూ అలానే జరుగుతోంది. ప్రభుత్వం ఆపరేషన్ హుజురాబాద్ స్టార్ట్ చేసింది. నయానో, భయానో.. నియోజకవర్గంలోని ఈటల వర్గీయులందరినీ ఆయన నుంచి దూరం చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ హుజురాబాద్ పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో మాట్లాడుతూ.. వారికి ప్రభుత్వ నిధుల ఆశ చూపి.. వారితో కేసీఆర్‌కు జై కొట్టిస్తున్నారు. హుజురాబాద్‌లో ఈటలను ఏకాకిని చేసే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ ఈటల రాజేందర్‌ను రెచ్చగొడుతున్నారు. రఘురామ, ఈటల. ఇద్దరూ గట్టి పిండాలే. ఇలాంటి బెదిరింపులకు భయపడే రకం కాదు. తెగించారు కాబట్టే.. అధికార పీఠానికి భయపడకుండా ఎదురు నిలిచారు. కొండను ఢీ కొంటున్నామని తెలుసు. అయినా.. సరెండర్ కాకుండా.. సమరానికే సిద్దమవుతున్నారు. ఈ ఇద్దరు ఉద్దండులు.. బస్తీమే సవాల్ అంటూ ఏకంగా సీఎంకే సవాల్ విసురుతున్నారు. అందుకే ఇప్పుడు.. ఏపీలో జగన్ సైన్యమంతా ఒకవైపు.. రఘురామ ఒక్కడు ఒకవైపు.. తెలంగాణలో గులాబీ దళమంతా ఒకవైపు.. ఈటల రాజేందర్ ఒక్కడు ఒకవైపు..వన్ మ్యాన్ ఆర్మీలా.. ఆ ఇద్దరు ఇప్పుడు బలమైన రాజ్యంపై ఒంటరిగా దండయాత్ర చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ టార్గెట్ పాలిటిక్స్‌లో గెలుపు ఎవరిదో త్వరలోనే తేలుతుంది.. అప్పటి వరకూ ఈ ఇద్దరూ మొనగాళ్లే...
http://www.teluguone.com/news/content/raghurama-and-etele-targeted-politics-in-2-telugu-states-39-115854.html





