ఆమె లేటెస్ట్ అభిమాని రజినీకాంత్!
Publish Date:Aug 20, 2016
Advertisement
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఇది ఎంత వరకూ నిజమో మనకు తెలియదుగాని ఒక విజయం మాత్రం సింధు రేంజ్ ని అమాంతం పెంచేసింది! ఇప్పుడు పూసర్ల వెంకట సింధుకి ఒలంపిక్స్ సిల్వర్ మెడల్ బోలెడు మంది కొత్త ఫ్యాన్స్‌ని తెచ్చిపెట్టింది. వారిలో ఎవరో మామూలు జనం కాదు ఏకంగా రజినీకాంత్ కూడా వున్నాడు! అదీ విశేషం... సెలబ్రిటీలకే సెలబ్రిటీ అయిపోయిన సింధుని ఉద్దేశించి '' హ్యాట్సాఫ్ సింధు.. నేను నీకు పెద్ద అభిమానినయ్యాను. అభినందనలు'' అంటూ ట్వీట్ చేశాడు తలైవా! అంతే కాదు, ''మా హృదయాలను గెల్చుకున్నావు. నిన్ను చూసి యావద్భారతం గర్విస్తోంది. ఈ క్షణాలను మాకిచ్చినందుకు ధన్యవాదాలు'' అన్నాడు మరో లివింగ్ లెజెండ్ అమితాబ్! ఇక క్రికెట్ లోకపు దేవుడు సచిన్ అయితే ''భారత యువ కెరటమా బాగా పోరాడావు. అద్భుతమైన ప్రదర్శనతో మా మనసులు గెలుచుకున్నావ్'' అంటూ సింధుని అభినందించాడు.
కేవలం సినీ, క్రీడా ప్రముఖులే కాదు సింధు మేనియాలో దేశాన్ని నడుపుతోన్న ఉద్ధండులు కూడా మునిగిపోయారు! రాష్ట్రపతి ప్రణబ్ అయితే '' చరిత్ర సృష్టించినందుకు హృదయపూర్వక అభినందనలు. నీతోపాటు దేశమంతా సంతోష సాగరంలో మునిగి తేలుతోంది. నువ్వు ప్రదర్శించిన మనోబలం, ధైర్యం, తెలివి మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి '' అన్నారు. ప్రధాని మోదీ సైతం తన మోదాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు. ''రజతం తెచ్చినందుకు అభినందనలు. చాలా బాగా పోరాడావు. నీ విజయం చరిత్రాత్మకం. ఏళ్లపాటు దీన్ని గుర్తుచేసుకుంటాం'' అన్నారు.
తెలుగు వారికి గర్వకారణమైన సింధుపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ప్రశంసలు కురిపించారు. ''బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు యువతకు స్ఫూర్తిప్రదాయని. విజయం కోసం ఆమె తుదకంటూ ఎంతో పోరాడింది. ఒలింపిక్స్‌లో దేశానికి రజత పతకం సాధించిన ఆమెను ఆదర్శంగా తీసుకొని, యువత జాతీయభావం పెంచుకోవాలి'' అన్నారు. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియా అయితే ''అలుపన్నదే లేకుండా గగన తారకలా పోరాడావు. నీలానే ఆడాలని ఎందరిలోనో ఆశలు పుట్టించావ్. నీ పతకం భరత మాత కిరీటంలో అత్యంత అమూల్యమైన వజ్రం'' అన్నారు. సింధుని ఆకాశానికెత్తిన వాళ్లలో ఇంకా చాలా మందే వున్నారు. విశ్వనాథన్ ఆనంద్, అభినవ్ బింద్రా, పేస్, భూపతి, విజేందర్ సింగ్.... ఇలా బోలెడు మంది. ఒక్క విజయం రేంజ్ నే మార్చేయటం అంటే ఇదే మరి!
http://www.teluguone.com/news/content/pv-sindhu-45-65356.html





