సెప్టెంబర్ మొదటి వారంలోనే పుష్కర పనులు ప్రారంభం : మంత్రి శ్రీధర్ బాబు
Publish Date:Aug 14, 2026
Advertisement
గోదావరి పుష్కరాలు– 2027 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. పుష్కరాలకు సంబంధించిన అభివృద్ధి, మౌలిక వసతుల పనులను సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన టెండర్ ప్రక్రియను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ‘గోదావరి పుష్కరాలు–2027’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్కరాల ఏర్పాట్లపై శాఖలవారీగా సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, రవాణా, రోడ్ల అనుసంధానం, భద్రత, పారిశుద్ధ్యం తదితర అంశాలపై చర్చించారు. పనులను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని మంత్రి అధికారులకు సూచించారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటించి పనుల పురోగతిని, నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. వర్క్ ప్రోగ్రెస్‌ను రోజువారీగా తెలుసుకునేలా ప్రత్యేక డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. ఏ పని ఎంతవరకు పూర్తయింది, ఎక్కడ జాప్యం జరుగుతోంది, ఇంకా ఎలాంటి పనులు చేపట్టాల్సి ఉందన్న అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమష్టిగా పనిచేయాలని శ్రీధర్ బాబు అన్నారు. శాఖల మధ్య సమన్వయం లోపించకుండా సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. భక్తులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ప్రాంతానికి రోడ్డు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కడైనా రోడ్ల అనుసంధానం లోపించినట్లు గుర్తిస్తే వెంటనే స్పందించి స్థానిక నిధులతో అవసరమైన పనులు చేపట్టాలని ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు, పండితులను తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలని మంత్రి సూచించారు. భక్తులకు సేవలు అందించేందుకు ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలను ముందుగానే గుర్తించి వారి సేవలను సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఇచ్చిన సలహాలు, సూచనలను అధికారులు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పుష్కరాల ఏర్పాట్లలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. నిర్దేశిత గడువుల్లో పనులు పూర్తి చేయడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేస్తేనే గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించగలమని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. Pushkara work begins in September, Minister Sridhar Babu, Godavari Pushkaralu-2027, CM Revanth rddy, Cabinet Sub-Committee, Ponguleti Srinivas Reddy, Vivek Venkataswamy
గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే టైర్-1 ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసి పుష్కరాల ఏర్పాట్లు, భక్తుల రద్దీ, రవాణా తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/pushkara-work-begins-in-september-36-228924.html





