ఆషాడం వస్తే చాలు..పూరీలో రథ యాత్ర ప్రారంభం
Publish Date:Jun 25, 2025

Advertisement
పూరి జగన్నాథ ఆలయం. అంతుచిక్కని రహస్యాల గని. ఈ ఆలయంపై ఏ సమయంలోనూ నీడ పడక పోవడం ఒక ప్రాకృతిక విచిత్రి. కాగా.. ఆలయ పై భాగంలో ఉన్న ఇరవై అడుగుల సుదర్శన చక్రం పూరీలోని ఏ ప్రాంతం నుంచి చూసినా కనిపించే దిక్సూచి. ఆలయ శిఖరంపై ఎగిరే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరడమొక దైవలీలగా ప్రసిద్ధి. ఆలయంలోపలికి ప్రవేశించిన తర్వాత సముద్రపు ఘోష వినిపించకపోవడం మరో విశేషం. ఇక ఆలయంలో వండే ప్రసాదం ఎంత మందికి వండినా ఎప్పుడూ వృధా కాక పోవడం మరో అంతుచిక్కని రహస్యం. ఏటా జరిగే పూరీ జగన్నాథ రథయాత్ర జగత్ ప్రసిద్ధం. భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళా ఖాతం తీరాన వెలసిన అత్యంత పురాతన ఆలయం పూరీ జగన్నాథ ఆలయం. హిందువులు తప్పక సందర్శించాల్సిన దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. చార్ ధామ్ ఆలయాల్లోనే సుప్రసిద్ధం.
ఈ ఆలయం ఇటు ఇతిహాస అటు చారిత్రక విశేషాల సమాహారం. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం కళింగ పాలకుడైన చోడగంగాదేవ నిర్మించినదిగా చెబుతుంది ఆలయ చరిత్ర. అంతే కాదు ఈ ఆలయ నిర్మాణంలో అనంగభీమదేవ పాత్ర కూడా ఉంది. తర్వాతి కాలంలో రామచంద్ర దేవ విగ్రహ పునఃప్రతిష్ట చేసినట్టుగానూ చెబుతోంది స్థల చరిత్ర.
అయితే జగన్నాథుడి విగ్రహాలు ఒక పూర్ణ రూపంలో గాక.. విచిత్రాకారంలో ఉంటాయి కారణమేంటన్నది అంతుచిక్కని ప్రశ్న. అయితే ఇందుకంటూ కొన్నికథనాలు ప్రచారంలో ఉన్నాయి. స్వతహాగా.. ఇక్కడి జగన్నాథుడిని స్థానిక గిరిజనుల దేవుడనీ, నీల మాధవుడనీ నమ్ముతారు. అడవిలో ఒక రహస్య ప్రాంతంలో గిరిజన రాజు విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే ఒక యువకుడ్ని పంపుతాడట. అయితే అతడు విశ్వావసు కుమార్తెను ప్రేమించి పెళ్లాడుతాడట. తన వివాహానంతరం.. జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే విద్యాపతి అడగ్గా.. అతడి మామగారైన విశ్వావసుడు కళ్లకు గంతలు కట్టి.. ఆ ప్రాంతానికి తీస్కెళ్తాడట. ఆ దారి గుండా ఆవాలు ఆనవాళ్లుగా చల్లిన విద్యాపతి.. ఎట్టకేలకు రాజుకు కబురు పెడతాడట. అయితే రాజు ఆ ఆనవాళ్ల ద్వారా అక్కడకు చేరుకోగానే విగ్రహాలు కనిపించవట.
తిరిగి రాజ్యానికి చేరిన రాజు కలలో జగన్నాథుడు కనిపించి.. సముద్ర తీరానికి వేపకొయ్యలు కొట్టుకొస్తాయని.. వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడట. కొయ్యలు కొట్టుకొస్తాయి కానీ విగ్రహం చేయడమెలా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే విశ్వకర్మ.. ఒక వికలాంగుడి రూపంలో వచ్చి తానీ కార్యం నెరవేర్చుతానని అంటాడట. అయితే.. 21 రోజుల పాటు తాను నిద్రాహారాలు లేకుండా ఈ విగ్రహాలు చెక్కుతాననీ.. ఎవరూ ఈ పరిసరాలకు రాకూడదని షరతు విధిస్తాడట. ఎన్నాళ్లయినా విగ్రహ నిర్మాణం పూర్తి కాకపోవడంతో రాణి గుడించా దేవి.. తొందర పెట్టడంతో.. గడువు తీరకుండానే తలుపులు తెరుస్తారట. అక్కడ శిల్పి కనిపించడు. సగం చెక్కీ చెక్కని శిల్పాలుంటాయి. దీంతో బ్రహ్మదేవుడ్ని ప్రార్ధిస్తాడా రాజు. అయితే అదే రూపంలో ఇక్కడ విగ్రహాలు పూజలందుకునేలా ఆనతిస్తాడా చతుర్ముఖుడు. తానే వాటికి ప్రాణప్రతిష్ట చేస్తాడు. అందుకే ఇక్కడి విగ్రహాలకు అభయ హస్తం, వరద హస్తం కనిపించదని అంటారు. అయితే 14 లోకాలను వీక్షించడానికి చారడేసి కళ్లతో ఇక్కడి విగ్రహాలుంటాయని అంటారు.
ఇక దేవాలయానికి సంబంధించిన సంప్రదాయ గాథల ప్రకారం.. పూరీ సముద్ర తీరంలోని ఒక మర్రి చెట్టు దగ్గర.. ఇంద్రనీల ఆభరణంగా అవతరించాడట ఆ జగన్నాథుడు. అయితే ఈ నీలి ఆభరణం చూడగానే తక్షణ మోక్షం లభిస్తుందట. దీంతో యమధర్మరాజు ఈ ఆభరణాన్ని భూమిలో పాతి పెడతాడట. ద్వాపరయుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు.. అంతు చిక్కని ఆ రూపం గురించి తెలుసుకోవాలని చెప్పి.. ఘోర తపస్సు చేశాడట. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై పూరీ సముద్ర తీరానికి వెళ్లి.. అక్కడే తేలియాడే చెట్టు దుంగను కనుక్కని దాని కాండలోంచి తనకు రూపు తయారు చేసుకురమ్మని అతడ్ని ఆజ్ఞాపించాడట. ఈ కార్యం నిర్విఘ్నంగా నిర్వహించిన రాజు విగ్రహాలను ఎలా చేయాలో అర్ధం కాక యజ్ఞం చేశాడట. యజ్ఞ నారసింహరాజు ప్రత్యక్షమై నారాయణుడ్ని నాలుగు అక్షరాల్లో విశదీకరించమనడంతో.. అవి జగన్నాథ- బలరామ- సుభద్ర- సుదర్శన చక్రాలైతే బావుంటాయని భావించారట. విశ్వకర్మ చిత్రకారుడి రూపంలో వచ్చి ఈ విగ్రహాలను చెక్కి వెళ్లాడట.
ఈ ఆలయం కొన్ని తరాలుగా హిందూ- ఆదివాసీ సంస్కృతుల మేలు కలయికగా వస్తోంది. ఈ మూడు విగ్రహాలు జైన ఆచారాలుగా పిలిచే సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానంద్, సమ్యక్ చరితలకు ప్రతీకగా ప్రాచుర్యం పొందాయి. ఇవి మోక్ష మార్గాలుగా అంతులేని ఆనంద ప్రదాతలుగా పిలవబడుతున్నాయని నమ్ముతారు.
ఇక్కడి జగన్నాథుడు నారాయణుడిగా, బలభద్రుడు ఆదిశేషువుగా అదే సమయంలో ఆలయంలోని విగ్రహాలు భైరవ, విమలగానూ పూజలందుకుంటున్నాయి. అందుకే ఇది శైవ వైష్ణవ క్షేత్రాల్లోనే సుప్రసిద్ధమైనదిగా భావిస్తుంటారు. అంతే కాదు ఇటు శైవ అటు వైష్ణవతో పాటు శక్తిత్వానికీ ఈ ఆలయం ఒక ప్రతీక. ఈ ఆలయ నిర్మాణం 4 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో చుట్టూ ప్రహరీ ఎత్తైన కోటగోడలను కలిగి ఉంటుంది. ఇందులో 120 గుడులు ఇతర పూజనీయ స్థలాలున్నాయి. ఒడిశా నిర్మాశైలికి చెందిన ఈ ఆలయం భారతీయ అద్భుత నిర్మాణాలలో ఒకటి.
ఇక ఎనిమిది ఆకులతో నిర్మితమైన నీలచక్ర- శ్రీ చక్రం అష్టధాతువులతో తయారైనదిగా నమ్ముతారు. ఎత్తైన రాతి దిమ్మపైగల ధ్వజస్థంభం గర్భగుడికన్నా 214 అడుగుల ఎత్తులో ఉంటుంది. చుట్టపక్కల పరిసరాల్లో అతి పెద్దదిగా దర్శనమిస్తుంది. చుట్టూ ఒక పర్వత శ్రేణి ఉన్నట్టు కనిపిస్తుంది. సింహద్వారం సంగతి సరేసరి. రెండు వైపులా గాండ్రించే సింహాలతో అత్యంత గంభీరంగా ఉంటుంది. ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలుండగా.. ఉత్తర, పడమట, దక్షిణ దిక్కులలో హథిద్వారా అంటే ఏనుగు, వ్యాగ్ర ద్వారా అంటే పులి, అశ్వద్వారా అంటే గుర్రాల ద్వారాలుగా ఇవి కనిపిస్తాయి.
గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ, బలభద్ర, సుభద్రల మూల విరాట్టులు రత్నవేది ఆభరణాలతో అలంకరించబడి ఉంటాయి. వీటితో పాటే సుదర్శన చక్ర, మదనమోహన, శ్రీదేవి, విశ్వధాత్రిల విగ్రహాలు కూడా రత్నవేదిపై ఉంటాయి. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్రాల విగ్రహాలు దారు బ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేప కాండాల నుంచి తయారయ్యాయి. కాలాలను బట్టి ప్రతిమల నగలు, దుస్తులను మారుస్తుంటారు. వీటిని కొలవటం ఆలయ నిర్మాణం ముందు నుంచీ ఉంది. అంటే ప్రాచీన ఆదివాసుల కాలం నుంచీ ఉందని చెబుతారు.
ఇక్కడ మండపాలు ఇతరత్రా ఎన్నో ఆలయాలతో ఎంతో పవిత్రత తొణికిసలాడుతుంది. ఇక ఆలయ వంట శాల ఇక్కడి మహాప్రసాదం ఏ ఫైవ్ స్టార్ ఫుడ్ కి తీసి పోనంత నాణ్యంగా ఉండటమే కాదు. ఆ రుచికి ప్రత్యేకమైన జియోగ్రాఫికల్ గుర్తింపు ఉంది. ఇక్కడి వంటకాలు ఎంతో రుచిగా శుచిగా ఎందుకు ఉంటాయని చూస్తే.. ఈ వంటశాల మహాలక్ష్మీదేవి పర్యవేక్షణలో సాగుతుందని విశ్వసిస్తారు. ఇక్కడి వంటకు కేవలం మట్టి పాత్రలను మాత్రమే వినియోగించడం మరో ప్రత్యేకత. వంటశాలకు దగ్గరగా ఉన్న గంగా యమున అనే రెండు పవిత్ర బావుల నీటిని మాత్రమే వాడుతారు. మొత్తం 56 నైవేద్యాలను వండుతారు. ఈ నైవేద్యం జగన్నాథునికి సమర్పించిన తర్వాత మహా ప్రసాదంగా ఈశాన్యంలోని ఆనంద బజార్ లో పంచుతారు. ఇక్కడి భక్తులు ఈ మహాప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.
ఇక్కడి ప్రధానమైన పండుగలేంటని చూస్తే.. జూన్ లో జరిగే రథయాత్ర. ఈ బ్రహ్మాండమైన పండగలో జగన్నాథ, బలరామ, సుభద్రల విగ్రహాలున్న మూడు పెద్ద రథాలను ఊరేగిస్తారు. ఏడాదిలో రెండు ఆషాడ మాసాలు వచ్చినపుడు నబకలేవర ఉత్సవం పేరిట.. కొత్త విగ్రహాలను మార్చుతారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున చందన యాత్ర రథ నిర్మాణ ప్రారంభాన్ని సూచిస్తుంది. జేష్ట పౌర్ణమిరోజున అన్ని ప్రతిమలకు స్నానం చేసి అలంకరిస్తారు. వసంతకాలంలో డోలాయాత్ర, వర్షాకాంలో ఝులన్ యాత్ర వంటి పండగలు నిర్వహిస్తారు. కార్తీక, పుష్యమాసాలలో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. ఇక విమలాదేవి కోసం ఆశ్వయుజ మాసంలో షోడశ దినాత్మక పూజ ఘనంగా నిర్వహిస్తారు. ఇక బ్రహ్మపరివర్తన వేడుక సైతం గొప్పగా జరుగుతుంది.
జేష్ట పౌర్ణమినాడు స్నాన యాత్ర తర్వాత జగన్నాథ- బలభద్ర- సుభద్ర- సుదర్శన విగ్రహాలను రహస్య మందిరాలకు తీస్కెళ్తారు. అక్కడ కృష్ణపక్షం వరకూ ఉంచుతారు. ఆ సమయంలో భక్తులకు జగన్నాథ దర్శనానికి వీలు పడదు. అప్పుడు బ్రహ్మగిరిలోని విష్ణువు స్వరూపమైన అల్వర్నాత్ ని కొలుస్తారు. అధిక స్నానం చేయడంతో దేవుళ్లకు జ్వరం చేసిందని.. పదిహేను రోజుల పాటు రాజ వైద్యునితో చికిత్స చేయిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్నాథ మహిమాన్విత చరితం. నిరంతర పారాయణం.
ఒడిశాలోని పూరీకి ఎలా చేరుకోవాలో చూస్తే.. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సదుపాయాలున్నాయి. భువనేశ్వర్ బీజూపట్నాయక్ ఎయిర్ పోర్ట్ పూరీకి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన నగరాల నుంచి రైలు సర్వీసులు విస్తృతంగా ఉన్నాయి. కోల్ కతా- చైన్నై ప్రధాన రైలు మార్గం కావంతో .. ఖుర్దారోడ్ రైల్వే స్టేషన్లో దిగి.. అక్కడి నుంచి పూరీకి టాక్సీల్లో చేరుకోవచ్చు. ఈ స్టేషన్ పూరీకి కేవలం 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భువనేశ్వర్, కోల్ కతా, విశాఖ నుంచి బస్సు సౌకర్యం ఉంది.
http://www.teluguone.com/news/content/puri-jagannath-temple-25-200672.html












