ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రక్రియ ప్రారంభం.. ఈసీ ప్రకటన
Publish Date:Jul 23, 2025
Advertisement
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామా దేశవ్యాప్తంగా సృష్టించిన రాజకీయం ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయినా తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైందని బుధవారం (జులై 23) కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గుర్తుచేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం.. ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత భారత ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేశారు సీఈసీ అధికారులు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను ప్రెసిడెన్షియల్ అండ్ వైస్-ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్స్ యాక్ట్, 1952 ప్రకారం రూపొందించిన ప్రెసిడెన్షియల్ అండ్ వైస్-ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్ రూల్స్, 1974 ద్వారా నిర్వహిస్తామని గుర్తుచేశారు సీఈసీ అధికారులు. ఈ ప్రక్రియను అనుసరిస్తూ.. భారత ఎన్నికల సంఘం ఇప్పటికే 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహాలను ప్రారంభించిందని తెలిపారు. ఈ సన్నాహాక చర్యలు పూర్తయ్యాక, ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. ప్రస్తుతానికి ప్రారంభించిన ప్రధాన సన్నాహాక చర్యలను ప్రకటనలో పేర్కొన్నారు సీఈసీ అధికారులు. ఓటర్ల జాబితా తయారీ, ఇందులో లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన ఎన్నికైన సభ్యులతో పాటు నామినేట్ అయిన సభ్యులు కూడా ఉంటారని చెప్పుకొచ్చారు. రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌లను ఖరారు చేస్తామని... ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ను ప్రకటిస్తామని సీఈసీ అధికారులు పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/process-for-the-election-of-vice-president-25-202548.html





