కొవ్వూరు ఫ్లై ఓవర్ పై బస్సు దగ్ధం
Publish Date:Jan 6, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో బుధవారం (జనవరి 7) తెల్లవారు జామున ఓ ప్రైవేటు బస్సు దగ్ధమైంది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగింది. ఖమ్మం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్‌పైకి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణీకులను కిందకు దింపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన జరిగిన సమయంలో బస్సులో ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
http://www.teluguone.com/news/content/private-travel-bus-burnt-36-212125.html





