ప్రముఖ యోగా గురువు మృతి.. ప్రధాని మోదీ సంతాపం
Publish Date:May 4, 2025
Advertisement
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, యోగా గురువు స్వామి శివానంద తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వారణాసిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శివానంద మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆధ్యాత్మిక సాధనను, యోగా రంగానికి చేసిన అసమానమైన కృషిని ప్రధాని కొనియాడారు. దేశంలోని ప్రతి తరానికి ఆయన స్ఫూర్తినిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. ఆయన మృతి యోగా రంగానికి తీరని లోటన్నారు.1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్‌లోని సిల్హెత్(ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) జిల్లాలో నిరుపేద కుటుంబంలో స్వామి శివానంద జన్మించారు. ఆరేళ్ల వయసులోనే శివానంద తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో ఆయన పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద గోస్వామి ఆయనను పెంచి పెద్ద చేయడమేగాక, యోగా వంటి ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. ఈ క్రమంలోనే తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేసిన స్వామి శివానంద.. గత 50 ఏళ్లుగా పూరిలో 400-600 కుష్టు రోగులకు సేవ చేశారు.ఆయన వయస్సు 128 ఏళ్లు అనే ప్రచారం ఉంది.యోగా రంగానికి చేసిన కృషికి గాను 2022లో శివానంద.. అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. తెల్లని ధోవతి, కుర్తా ధరించి.. కాళ్లకు చెప్పులు లేకుండా అత్యంత సామాన్యంగా వచ్చి ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించడం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది.
http://www.teluguone.com/news/content/prime-minister-modi-39-197438.html





