ఎందరో ప్రధాని అభ్యర్దులు. అందరికీ వందనాలు!
Publish Date:Apr 25, 2013
Advertisement
బహుశః స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంతవరకు ఎన్నడూ కూడా ప్రస్తుతం ప్రధాని పదవిపై జరుగుతున్నంత చర్చ జరగలేదు. ఇంత కాలం దేశం గాంధీ నెహ్రూ వంశీకుల చేతిలోంచి బయటపడక పోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చును. గతంలో సోనియా గాంధీకి కూడా ఈ అవకాశం వచ్చినప్పుడు ఆమె ఇటలీ మూలాలను ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో ఆమె వెనక్కు తగ్గవలసి వచ్చింది తప్ప, కాంగ్రెస్ వాదులు చెపుతున్నట్లు ఆమె ప్రధాని పదవిని త్యాగం చేయలేదని అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ, దేశాన్ని ఆమె పరిపాలిస్తున్నారనే సంగతి బహిరంగ రహస్యమే. దేశానికి సుదీర్గ కాలం ఏకచత్రాదిపత్యం వహించి పరిపాలించిన ఆ కుటుంబ ప్రాభాల్యమే నేటికీ బలంగా ఉన్నపటికీ, మకుటం లేని యువరాజుగా పేర్కొనబడుతున్న రాహుల్ గాంధీ ప్రధానిపదవి పట్ల కొంచెం అకాల వైరాగ్యం ప్రదర్శించడంవలన “అయితే మరెవరూ?” అనే ప్రశ్న కాంగ్రెస్ లో ఉత్పనం అయింది. కర్ణుడికి సహజ కవచకుండలాలు కలిగి ఉన్నట్లు, ప్రధాని డా. మన్మోహన్ సింగ్ కి కూడా సమర్దుడు, ఆర్ధిక వ్యవహారాలలో నిపుణుడు, నిష్కళంక చరితుడు, వివాదరహితుడు, మేధావి, సౌమ్యుడు వగైరా వగైరా భుజకీర్తులన్నీ కలిగిఉన్నపటికీ, కాంగ్రెస్ నేతలెవరి కంటికి ఆయన ఆనకపోగా, ఆయన కుర్చీలో కూర్చోని ఉండగానే ఆయనను తప్పించడం గురించి పార్టీలో చర్చకు అనుమతి నీయడం ఇంకా దారుణం. రాహుల్ గాంధీ ప్రధాని పదవి పట్ల అనాసక్తి చూపుతున్నపటికీ, 65 ఏళ్లుగా కాంగ్రెస్ సంస్కృతీ గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవారయినా ఆ కుర్చీ రాహుల్ గాంధీకే రిజర్వ్ చేయబడి ఉందని చెపుతారు. స్త్రీలకూ ప్రసూతి వైరాగ్యం, మనుషులకు శ్మశాన వైరాగ్యం అన్నట్లు, వరుస ఓటములను చవి చూసిన రాహుల్ గాంధీకి ప్రస్తుతం రాజకీయ వైరాగ్యం కలిగినా అది తాత్కాలికమేనని చెప్పవచ్చును. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి అందిస్తున్న బీజేపీ నుండి ఆయన సరిగ్గా అందుకోగలిగితే అప్పుడు ఆ రాజకీయ వైరాగ్యం కూడా మాయమయిపోవడం ఖాయం. అయితే మోడీ ప్రభావంతో బీజేపీకి దేశంలో రాజకీయ వాతావరణం కొంచెం సానుకూలంగా కనిపిస్తున్నపటికీ, మోడీ వ్యతిరేఖత ఆ పార్టీ పట్ల శాపంగా మారింది. అందువల్లే నేటికీ ఆయనకు కర్ణాటక ఎన్నికల బాద్యతను దైర్యంగా అప్పగించలేక, అటు కర్ణాటకను వదులుకోలేక బీజేపీ నానా అవస్థలు పడుతోంది. కర్ణాటకలో అవినీతి గనులను తవ్వి పోసిన బీజేపీ నేతలని ప్రజలు ఎంతమాత్రం నమ్మడానికి సిద్దంగా లేరని ఖచ్చితంగా చెప్పవచ్చును. అద్వానీ మొదలు సుష్మా స్వరాజ్ వరకు ఎందరు నేతలు పర్యటించి, ఎన్ని గొప్ప ప్రసంగాలు చేసినా, అక్కడా వారి ప్రభుత్వంపట్ల ప్రజలలో ఏర్పడిన వ్యతిరేఖ భావాలను తుడిచిపెట్టలేరు. ఇదే రాహుల్ గాంధీ కి ఒక గొప్పవరంగా మారనుంది. బీజేపీ మోడీ అస్త్రాన్ని వాడుకొని ఉంటే, రాహుల్ గాంధీ పని కొంచెం కష్టమయేదేమో! ఇక ప్రధాని పదవికి ప్రధాన అర్హత రాజకీయ మద్దతే తప్ప వేరే ఏ ఇతర అర్హతలు అవసరం లేదని దృడంగా నమ్మే మాయవతి, ములాయం సింగులు, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు కూడా 3వ,4వ,5వ ఫ్రంటు అంటూ అందరూ తలొక ఫ్రంటు పెట్టుకొని తమ ప్రయత్నాలు గట్టిగానే చేసుకుపోతున్నారు. దేశానికి ఇక సంకీర్ణ ప్రభుత్వాలు తప్పవని, నేడు కాకపోతే రేపయినా తాము ప్రధాని అవడం ఖాయమని వారు బల్లగుద్ది మరీ చెపుతుంటే ప్రజలు ఇప్పటి నుండే భయబ్రాంతులవుతున్నారు. అందువల్ల రాబోయే ఎన్నికలను అటువంటివారు అగ్నిపరీక్షగా భావిస్తే, అవి యావత్ భారతీయుల విజ్ఞతకి పరీక్షగా భావించవలసి ఉంటుంది.
http://www.teluguone.com/news/content/prime-minister-aspirants-37-22711.html





