వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం.. ఆకలి దప్పులతో భక్తుల అవస్థలు
Publish Date:Feb 10, 2025
Advertisement
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అన్ని రోడ్లూ ప్రయాగ్ రాజ్ వైపే అన్నట్లుగా భక్తుల రాక కొనసాగుతుండటంతో ప్రయాగ్ రాజ్ కు వెళ్లే మార్గాలన్నిటిలోనూ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ కారణంగా వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జాం ఇదేనని అధికారులు అంటున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 9) నుంచి ట్రాఫిక్ జాం అయ్యింది. ముందుకు వెళ్లలేక, వెనక్కు రాలేక ట్రాఫిక్ లో చిక్కుకున్న భక్తులు నానా ఇబ్బందులూ పడుతున్నారు. ట్రాఫిక్ ఎప్పటికి క్లియర్ అవుతుందో కూడా ఎవరూ చెప్పలేకపోతున్న పరిస్థితి. ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు పోటెత్తారు. అంచనాలకు మించి జనం రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు మూడు వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న వారు ఆకలి దప్పులతో నీరసించిపోతున్న పరిస్థితి. మరోవైపు, భక్తుల రద్దీ కారణంగా సంగం రైల్వే స్టేషన్ ను అధికారులు వచ్చే శుక్రవారం వరకు మూసివేశారు. ఇలా ఉండగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే మహా కుంభమేళాకు వెడుతున్న భక్తులు అవస్థలు పడుతున్నారని సమాజ్ వాదీ పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రయాగ్ రాజ్ వైపు వెళ్లే దారిలో ట్రాఫిక్ జాం దృశ్యాల విడీయోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తక్షణమే ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా ఉండగా సోమవారం నాటికి మహాకుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన భక్తుల సంఖ్య 44 కోట్లకు చేరింది.
http://www.teluguone.com/news/content/prayagraj-traffic-zam-hundred-kilometers-25-192685.html





