అన్న, చెల్లికి పీకేనే అడ్వైజర్.. దొందు దొందేనా?
Publish Date:Sep 30, 2021
Advertisement
అదో జగన్నాటకం. అసలేమీ అర్థం కాదు. అన్నాచెల్లిల మధ్య ఏముందో ఎవరికీ తెలీదు. బయటకు మాట్లాడుకోరు. విడిపోయామంటారు. ఆస్థిగొడవలతో వేరుపడ్డామంటారు. అలిగి పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చేశానంటుంది. తండ్రి సమాధి సాక్షిగా ఎడముఖం- పెడముఖం పెట్టుకుంటారు. ఏపీలో వైఎస్సార్‌సీపీ. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ. ఏందో.. ఈ రాజకీయ డ్రామా. కొందరు షర్మల జగనన్న వదిలిన బాణమే అంటే.. మరికొందరు కేసీఆర్ బాణమని.. బీజేపీ బాణమని.. ఎవరికి తోచిన విశ్లేషణలు వాళ్లు చేశారు. ఆ గుసగుసలు అలా సాగుతుండగానే.. తెలంగాణ కోడలినంటూ వైఎస్సార్‌టీపీ స్థాపించేశారు. ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తూ.. చిత్తశుద్ధి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా, ప్రజల ఆదరణ అంతంత మాత్రమే. తండ్రి పేరు చెప్పుకొని ఓట్లు కొల్లగొట్టే పని ఆశించినంత మేర వర్కవుట్ అవడం లేదు. మంచి పేరున్న నేత, కాస్త ఫేస్ వ్యాల్యూ ఉన్న నాయకుడు.. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ పార్టీలో చేరలేదు. ఓ మీడియా సంస్థ సహాయంతో మాత్రమే ఎలాగోలా రాజకీయ బండి లాక్కొస్తున్నారు షర్మిల. ఇక, ఇలాగైతే వర్కవుట్ కాదని.. దేశంలోకే టాప్ మోస్ట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్‌ను హైర్ చేసుకున్నారు. డబ్బుకు డోకా లేకపోవడంతో.. భారీ మొత్తానికే ఒప్పందం కుదుర్చుకున్నారని చెబుతున్నారు. ఇప్పటికే పలు మీడియా సంస్థలకు, మీడియా ప్రముఖులకు పెద్ద మొత్తమే సమర్పించుకున్న షర్మిల.. ఇక పీకే.. కన్సల్టెన్సీకీ కళ్లు తిరిగే పైకం ఇచ్చేందుకు డీల్ కుదిరింది. ఆ వెంటనే పీకే టీమ్ లోటస్‌పాండ్‌లో వాలిపోయింది. మేడమ్‌తో సుదీర్ఘ చర్చలు జరిగాయి. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, మిగతా ప్రతిపక్షాల బలాబలాలు, ఇక్కడి సమస్యలు, ఇక్కడి భావోద్రేకాలు, అనుచరించాల్సిన వ్యూహాలు ఇలా అన్నిటిపైనా ప్రాధమిక చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది. ఆ మేధోమధనం ఓ కొలిక్కి వచ్చాక.. ఇక వచ్చే రెండేళ్లలో వైఎస్సార్‌టీపీ అనుసరించాల్సిన ఎత్తుగడలను పీకే టీమ్ రెడీ చేయనుంది. ఆసక్తికరంగా సరిగ్గా ఇదే సమయంలోనే అటు ఏపీలో వైఎస్సార్‌సీపీ కోసం వర్క్ చేసేందుకు ప్రశాంత్ కిశోర్ బృందం రంగంలోకి దిగింది. వారం గ్యాప్‌లో రెండు రాష్ట్రాల్లో, రెండు వేరు వేరు పార్టీలకు, అందులోనూ విభేదాలు ఉన్నాయని ప్రచారం అవుతున్న అన్నాచెల్లిల కోసం పీకే టీమ్ పని చేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే, పీకేతో ఎవరికి వారే వేరు వేరుగా డీల్ కుదుర్చుకోలేదని.. ఇటు తెలంగాణలో షర్మిల పార్టీకి, అటు ఏపీలో జగన్ పార్టీకి పని చేయాలని.. రెండు డీల్స్ కాబట్టి పొలిటికల్ డిస్కౌంట్ ఇవ్వాలని బాగానే బేరం ఆడారని అంటున్నారు. చెల్లి కోసమూ అన్ననే సంప్రదింపులు జరిపారని చెబుతున్నారు. 1+1 డీల్‌తో పీకే టీమ్‌ను వైఎస్ ఫ్యామిలీ హైర్ చేసుకుందని తెలుస్తోంది. దీంతో, అన్నా-చెల్లిల మధ్య గొడవలనేది వట్టి డ్రామానేనా? తెలంగాణలో రాజకీయ పబ్బం గడుపుకోడానికి కావాలనే తమ మధ్య విభేదాలున్నాయనేలా సీన్ క్రియేట్ చేశారా? అనే అనుమానం కలుగుతోంది. అందుకు, మరింత బలం చేకూర్చేలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షర్మిల తనకు అన్నతో అంతపెద్దగా గొడవలేమీ లేవని.. కూర్చొని మాట్లాడుకుంటే సమసిపోతాయని.. జగన్ తనతో టచ్‌లోనే ఉన్నాడని, రెగ్యులర్‌గా ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నామని తేల్చేసింది. దీంతో, ఇదంతా తెలంగాణలో చెల్లిని రాజకీయంగా సెట్ చేయడానికి జగనన్న ఆడుతున్న పొలిటికల్ డ్రామానేనని.. షర్మిల జగన్ వదిలిన బాణమేనని తేలిపోతోందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/prashanth-kishor-hired-by-jagan-and-sharmila-25-123781.html





