పోలీస్ బాస్ సజ్జనార్‌కు పదోన్నతి.. నెట్టింట వెల్లువెత్తిన అభినందనలు
Publish Date:Apr 24, 2026
Advertisement
తెలంగాణ పోలీసు శాఖలో తాజాగా చేపట్టిన ఉన్నతాధికారుల పదోన్నతులు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ హోదా లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా సామాన్య ప్రజలు ఈ పదోన్నతి పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. సాధారణంగా అధికారులు పదోన్నతులు..సంబంధిత శాఖలో చర్చకే పరిమితమౌతాయి. అయితే.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ పదోన్నతి రాగానే.. మాత్రం నెట్టింట ఆయనకు అభినందనలు తెలుపుతూ పోస్టులు వెల్లువెత్తాయి. అలాగే సామాన్య ప్రజలు కూడా ఆయనకు ప్రమోషన్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1995, 1996 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరుగురిలో హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఒకరు. ఆయన డీజీపీ ర్యాంకులో హైదరాబాద్ సీపీ కొనసాగుతారు. కేవలం తెలంగాణ నుంచే కాకుండా, ఆయన స్వరాష్ట్రం కర్ణాటకతో పాటు దేశవిదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈ సందర్భంగా ఆయనను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు పోలీసు అధికారులకు పదోన్నతి కల్పిస్తే.. వారిలో ఒక్క సజ్జనార్ ప్రమోషన్ పట్ల మాత్రమే సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతుండటం ప్రత్యేకత, ప్రాధాన్యత సంతరించుకుంది. సజ్జనార్‌కు ప్రజల్లో ఇంతటి ఆదరణ ఉండటానికి ఆయన అనుసరిస్తున్న పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ సీపీగానే కాదు.. గతంలో ఆయన పని చేసిన ప్రతి చోటా.. సజ్జనార్ ప్రజలకు చేరువగా ఉండటానికే ప్రాధాన్యత ఇచ్చారు. బాధితులకు భరోసా ఇస్తూ, అండగా నిలిచేవారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రత విషయంలో ఆయన తీసుకునే కఠిన నిర్ణయాలు ప్రజల మనసు గెలుచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతే కాకుండా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు నిరంతరం టచ్‌లో ఉంటారు. సైబర్ నేరాలు, మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆయనది ప్రత్యేక శైలి. అదే సజ్జనార్ కు ప్రజలలో గుర్తింపును, వారి హృదయాలలో స్థానాన్ని కల్పించింది. గతంలో కూడా సజ్జనార్ పలు కీలక బాధ్యతలు నిర్వర్తించి విజయవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడని ఆయన వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి సముచితమైన పదోన్నతి కల్పించడంపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. కేవలం అధికారులే కాకుండా సామాన్యులు కూడా సజ్జనార్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం డీజీపీ హోదా పొందిన తర్వాత సజ్జనార్ తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. నగరంలో పెరుగుతున్న నేరాలను అరికట్టడం, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలపై ఆయన తనదైన ముద్ర వేస్తారని నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక అధికారి పట్ల ప్రజలకు ఉండే నమ్మకం, గౌరవం ఆ అధికారి సాధించిన అతిపెద్ద విజయమని ఈ అభినందనల వెల్లువ చూస్తుంటే స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఆయన మరిన్ని కీలక బాధ్యతలు స్వీకరించి పోలీసు వ్యవస్థకు మరింత వన్నె తీసుకురావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/pramotion-to-hyderabad-cp-sajjanar-36-218174.html





