పవన్ పై ప్రకాశ్ రాజ్ ‘సెలెక్టివ్’ విమర్శలు!?
Publish Date:Apr 29, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు సెలెక్టివ్ గా ఉంటున్నాయని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ కొన్ని అంశాలపై మాత్రమే గళం ఎత్తుతున్నారన్న ప్రకాష్ రాజ్ . ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. కేవలం మతపరమైన భావోద్వేగాలకు సంబంధించిన అంశాలపైనే స్పందిస్తూ, ఇతర దేశవ్యాప్త సమస్యలను పవన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ముఖ్యంగా మణిపూర్ హింసాకాండ, అక్కడ మహిళలపై జరిగిన దాడుల వంటి సున్నితమైన అంశాల గురించి మౌనానికి కారణమేంటన్నారు. కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఒక నిర్దిష్ట వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారనేది ప్రకాష్ రాజ్ ప్రధాన వాదన. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్.. అదే ధర్మంలో భాగంగా ఇతర అన్యాయాలు జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇలా సెలెక్టివ్ అంశాలనే ఎంచుకుని విమర్శలు చేయడం వల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాదం కేవలం లడ్డూ ప్రసాదానికి మాత్రమే పరిమితం కాకుండా, రాజకీయ నాయకుల నైతిక బాధ్యతపై చర్చకు దారితీసింది. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదని, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అని, ఆయన తన విమర్శల్లో నిష్పక్షపాతంగా ఉండాలని ప్రకాష్ రాజ్ సూచించారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కూటమి నాయకులు ప్రకాష్ రాజ్ విమర్శలను తిప్పి కొడుతున్నారు. మతపరమైన సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న అంశం కాబట్టే పవన్ గట్టిగా స్పందిస్తున్నారంటున్నారు. అయితే.. ప్రకాష్ రాజ్ మాత్రం తన పంథా మార్చుకోకుండా, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సెలెక్టివ్ పాలిటిక్స్ కు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.ఇక ప్రకాశ్ రాజ్ విమర్శలపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ ఏపీ రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది.
http://www.teluguone.com/news/content/prakashraj-sensational-comments-39-218603.html





