పెళ్లయిన పది రోజులకే ఫుట్‌బాల్ ప్లేయర్ దుర్మరణం
Publish Date:Jul 3, 2025
Advertisement
పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. స్పెయిన్ సనాబ్రియాలో సోదరుడితో కలిసి లంబోర్గిని కారులో ప్రయాణిస్తున్న సమయంలో టైరు పేలి అదుపుతప్పి బోల్తా పడింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు. 10 రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న జోటా, స్పెయిన్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. జూన్ 22న తన ప్రేయసి రూట్ కార్డోసోను జోటా వివాహం చేసుకున్నాడు. వారికి పెళ్లికి ముందే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ యాక్సిడెంట్ జరగడానికి కేవలం కొన్ని గంటల ముందే, "ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేం" అనే క్యాప్షన్‌తో తన పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కన్నీటిపర్యంతమవుతున్నారు. పోర్చుగల్ జాతీయ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించిన జోటా, 2020 సెప్టెంబర్‌లో లివర్‌పూల్ క్లబ్‌లో చేరాడు. గత మే నెలలోనే లివర్‌పూల్ జట్టుతో కలిసి ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
http://www.teluguone.com/news/content/portugal-39-201180.html





