జంపింగుల జోరు.. పరేషాన్ లో పార్టీలు.. దుబ్బాకలో కాక
Publish Date:Oct 10, 2020
Advertisement
ప్రధాన పార్టీలకు సవాల్ గా మారిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తుండటంతో రాజకీయ సమీకరణలు రోజుకోలా మారిపోతున్నాయి. నియోజకవర్గంలో ప్రలోభాలు జోరందుకున్నాయి. డబ్బులు భారీగా చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. దీంతో దుబ్బాక నియోజకవర్గంలోని ద్వితియ శ్రేణి నేతలు వేగంగా పార్టీలు మారుతున్నారు. అన్ని పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో కొత్త నేతల చేరికలు జరుగుతున్నాయి. రోజంతా ఓ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్న నేతలు.. తెల్లారేసరికి మరో పార్టీ గూటికి చేరుతున్నారు. జంపింగ్ జిలానీలతో పార్టీలు పరేషాను అవుతున్నాయి. ఎవరిని నమ్మాలో తెలియక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో పట్టున్న చెరుకు చేరికతో కాంగ్రెస్ లో జోష్ కనిపించింది. అయితే కాంగ్రెస్ కు ఆ ఉత్సాహం ఎక్కువ సేపు నిలవలేదు. కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన ఇద్దరు సీనియర్ నేతలు.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి, బొంపల్లి మనోహర్ రావు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. వెంకటనర్సింహరెడ్డి, మనోహర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిన తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అయినట్టేనని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతిపక్షపార్టీలకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా రావని మంత్రి జోస్యం చెప్పారు. బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. యూత్ ఎక్కువగా ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినా.. ఆయన అనుచరుల్లో కొందరు కమలం పార్టీలో చేరారని తెలుస్తోంది. టీఆర్ఎస్ కు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు కూడా బీజేపీ జెండా కిందకు చేరారు. అయితే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ తగిలింది. కిసాన్ మోర్చా నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ రఘునందన్ రావుపై తీవ్ర ఆరోపణలు చేయడం.. ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. రెబెల్ లీడర్ ను పార్టీ నుంచి బహిష్కరించినా.. ఆయన చేసిన ఆరోపణలు ప్రభావం పార్టీపై కొంత వరకు ఉంటుందని భయపడుతున్నారు బీజేపీ నేతలు. అన్ని పార్టీలు వలసలను ప్రోత్సహిస్తుడటంతో దుబ్బాక రాజకీయం వేడెక్కింది. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమ వైపు లాగేస్తున్న పార్టీలు.. తమ నేతలు చేజారకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ప్రజ్లలో పలుకుబడి ఉన్న నేతలను మచ్చిక చేసుకునేందుకు భారీగా తాయిలాలు ఆఫర్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికలో దుబ్బాక నియోజకవర్గంలోని చోటామోటా లీడర్ల పంట పండుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎవరూ ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఉందంటున్నారు. పోలింగ్ కు ఇంకా చాలా సమయం ఉండటంతో వలస రాజకీయాలు ఎలా ఉంటాయోనన్న చర్చ జనాల్లో జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/political-heat-up-in-dubbak-constituency-39-104989.html





