హీటెక్కిస్తున్న కులగణన రాజకీయం!
Publish Date:May 6, 2025
Advertisement
కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయం చుట్టూ రాజకీయం హీటెక్కుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ మధ్య క్రెడిట్ వార్ నడుస్తుండగా, దీనిని ఎన్నికల్లో ఎలా ప్లస్ పాయింట్ గా మార్చుకోవాలన్న విషయంపై రెండు పార్టీలూ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. నిజానికి నార్త్ ఇండియా దగ్గర్నుంచి సౌత్ ఇండియా వరకూ కులాల ఆధారంగానే ఎన్నికలు జరుగుతుంటాయి. క్యాస్ట్ పాలిటిక్స్ గెలుపోటములపై ఎఫెక్ట్ చూపుతుంటాయి. ఇప్పుడు ఈ కులగణన మైలేజ్ తమ ఘనతే అని చెప్పుకునేందుకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. కులగణనకు తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. సీడబ్ల్యూసీలోనూ తెలంగాణ మోడల్ నే కేంద్రం పరిగణలోకి తీసుకుని జనాభా లెక్కల సమయంలో ఉపయోగించాలని తీర్మానించింది. అయితే ఇది బీజేపీకి ఏమాత్రం రుచించడం లేదు. అసలు రాష్ట్రాలకు కులగణన చేసే హక్కే లేనప్పుడు, అది చట్టబద్ధమే కానప్పుడు.. దాన్నెలా రోల్ మోడల్ గా తీసుకోవాలని బీజేపీ ప్రశ్నిస్తోంది. తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తేగానీ, ఇన్నాళ్లూ కులగణనపై నిర్ణయం తీసుకోని బీజేపీ ఇప్పుడు నిర్ణయం తీసుకుని రాజకీయం చేయడమేంటని కాంగ్రెస్ గరమవుతోంది. కులగణన, సర్వేకు మధ్య తేడా ఏంటో అందరికీ వివరించాలని, ఇందులో కాంగ్రెస్ చేసిందేమీ లేదని తెలంగాణ బీజేపీ ప్రచారం చేసేందుకు డిసైడ్ అయింది. కులగణన క్రెడిట్ ఏ మాత్రం హస్తం పార్టీకి వెళ్లకుండా ఇప్పటి నుంచే బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటున్నది. అసలు ఉన్నట్లుండి కేంద్రమంత్రి వర్గం కులగణన చేయాలని నిర్ణయించడం వెనుక కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ కూడా పెరుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. నిజానికి అక్కడ కుల రాజకీయాల జోరు చాలా ఎక్కువగా ఉంటుంది. 2023లో కుల గణన జరిపి, దాని ఆధారంగా రిజర్వేషన్ కోటాను పెంచే ప్రయత్నం చేసినా కోర్టుల్లో అడ్డుకట్ట పడింది. దీంతో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అన్న తమ నినాదానికి కులగణనతో పరిపూర్ణత చేకూరుతుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ పై పై చేయిసాధించాలంటే ఇంతకు మించి ప్లాన్ చేయాల్సిన పరిస్థితి. బిహార్‌లో 36% అత్యంత వెనుకబడిన వర్గాలు , 27.1% మంది BCలు ఉన్నారని, 2023 కులగణన వెల్లడించింది. అటు 2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కులగణన చుట్టూ గేమ్ నడిపేలా పొలిటికల్ పార్టీల వ్యవహారం నడుస్తోందంటున్నారు. సో క్యాస్ట్ సెన్సస్ ఆధారంగా బీజేపీ ఎన్ని ప్లాన్లు వేసినా.. తెలంగాణలో కులగణన చేసి నిజాయితీ, చిత్తశుద్ధి నిరూపించుకున్నామన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో తామే నిజాయితీతో ఉన్నామంటున్నారు. సో కులగణన అజెండా కులమే బలంగా మారుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాబోయే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్ ఇంపాక్ట్ చూపేందుకు రెడీ అవుతోంది. అయితే ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారన్నదే ఇప్పుడు హాట్ డిబేట్. కులగణన విషయంలో ఏ పార్టీని ఎక్కువగా నమ్ముతారన్న విషయంపైనే విజయావకాశాలు ఆధారప డ బోతున్నాయ్.
http://www.teluguone.com/news/content/political-heat-raising-with-caste-census-39-197564.html





