తెలంగాణ భవన్ కు పోలీసులు తాళం
Publish Date:Jun 16, 2025
Advertisement
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు పోలీసులు తాళం వేశారు. కేటీఆర్ అరెస్టు వార్తల నేపథ్యంలో ఈ ఘటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు సోమవారం (జూన్ 16) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. హాజరు కావడానికి ముందు తెలంగాణ భవన్ కు చేరుకుని అక్కడ మీడియాతో మాట్లాడి అక్కడ నుంచే నేరుగా ఏసీబీ విచారణకు వెళ్లారు. తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన ఆ సందర్భంగా ఈ ఫార్ములా రేస్ కేసులో తనను అరెస్టు చేసి జైలుకు పంపుతారని అన్నారు. ఆ తరువాత ఆయన ఏసీబీ విచారణకు వెళ్లారు. కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్లగానే పోలీసులు తెలంగాణ భవన్ కు తాళం వేశారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణుులు మండి పడుతున్నాయి. ప్రజాస్వామ్యమా పోలీసు రాజ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు తెలంగాణ భవన్‌కు తాళం వేయడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. అటు తెలంగాణ భవన్ సమీపంలోని నీలోఫర్ కేఫ్‌ను సైతం పోలీసులు మూయించి వేశారు. ఆ సమయానికి కేఫ్ లో ఉన్న వారిని బయటకు పంపించేసి ఆ తరువాత కేఫ్ ను మూయించివేశారు. తెలంగాణ భవన్ కు తాళం వేయడాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి అక్కడ నుంచి తరలించేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/police-lock-telanganabhawan-25-200065.html





