గజం మిథ్య.. పలాయనం మిథ్య!
Publish Date:Jun 24, 2025

Advertisement
ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్న... ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఏ రోజుకారోజు కొత్త మలుపులు తిరుగుతోంది. కొత్త చిత్రాలను చూపిస్తోంది. ఈ వ్యవహారంలో విచారణ జరుపుతున్న సిట్ ఈ కేసులో ప్రధాన నిందితునిగా అనుమానిస్తున్న స్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును దఫదఫాలుగా విచారిస్తోంది. అదే సమయంలో గుర్తించిన ఫోన్ ట్యాపింగ్ బాధితులు, రాజకీయ నాయకులను విచారించి వారి నుంచి వాంగ్మూలానను సేకరిస్తోంది. ఇదంతా ఏదో టీవీ డైలీ సీరియల్ వ్యవహారంలా నడుస్తోంది. కానీ.. అవుట్కమ్ ఏమిటన్నది మాత్రం భేతాళ ప్రశ్నగానే మిగిలిపోతోంది.
అదలా ఉంచితే.. ఎవరో పెద్దాయన అన్నట్లుగా.. ఈ కేసుకు సంబంధించి అందుతున్న సమాచారం మొత్తం నిజమే అయితే.. ఇది స్వాతంత్ర భారత చరిత్రలో ఏనాడు జరగని మెగా కాదు, మహా మెగా, మహామహా మెగా ఫోన్ ట్యాపింగ్ కుంబకోణంగా చరిత్రలో మిగిలిపోతుంది. ఈ కుంభకోణంలో కేవలం రాజకీయ కోణం మాత్రమే కాదు.. ఇంకా అనేక కోణాలు ఉన్నాయి అంటున్నారు. అవును.. సమస్త సామాజిక, ఆర్థిక నేరాలకు ఫోన్ ట్యాపింగ్ సాధనమైందని అంటునారు. ఎవరు ఎందుకు మొదలు పెట్టినా.. ఆ తర్వాత అయినవారు, కాని వారు, ఎవరికి వారు నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగుతున్నాను అన్నట్లు.. ఫోన్ ట్యాపింగ్ ను సాధనంగా చేసుకుని రాజకీయ ప్రయోజనాలకు మించిన ప్రయోజనాలు పొందారని అంటున్నారు. అనుమానిస్తున్నారు.
అందుకే.. ఇంతటి మెగా కుంభకోణంలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర రావు పాత్రే కీలకమా? ఆ ఒక్కడే అన్నీ చేశారా? పోనీ చేశారే అనుకున్నా.. మిగిలిన ప్రభుత్వ యంత్రాంగం ఏమి చేస్తున్నట్లు? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వ్యవస్థ ఏమి చేస్తునట్లు? ముఖ్యంగా.. ఇలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఉండేందుకే ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీ ఏమి చేసినట్లు, ఏమి చేస్తున్నట్లు? నిజానికి.. సిట్ విచారణకు హాజరైన ప్రతి సందర్భంలోనూ ప్రభాకర్‌రావు ట్యాపింగ్ జరగలేదని ఒక్కసారి కూడా చెప్పలేదు. ట్యాపింగ్ జరిగింది. కానీ, రివ్యూ కమిటీ అనుమతి, ఆమోదంతోనే ట్యాపింగ్‌లు చేసినట్లు స్పష్టంగా చెప్పిట్లు చెపుతున్నారు. అంటే, రివ్యూ కమిటీ ఆమోదతోనే.. ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందని ఎవరైనా అనుకుంటే కాదనే పరిస్థతి లేదని అంటున్నారు. నిజానికి ప్రభాకరరావు చెప్పక పోయినా.. రివ్యూ కమిటీ బాధ్యత నుంచి తప్పించుకోలేదు అంటున్నారు.
మరోవంక రివ్యూ కమిటీ చైర్మన్‌గా ఉన్న అప్పటి సీఎస్ శాంతికుమారి, సభ్యులుగా ఉన్న జీఏడీ పొలిటికల్ కార్యదర్శి రఘునందన్‌రావు, అప్పటి హోం శాఖ కార్యదర్శి జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్‌కుమార్‌లు సిట్ కు ఇచ్చినట్లు చెపుతున్న వాంగ్మూలంలో ఎస్‌ఐబీ నుంచి ట్యాపింగ్ జాబితా రావడంతో నమ్మకం తో రివ్యూ కమిటీ పూర్తిగా పరిశీలించకుండానే కేంద్ర టెలికం శాఖకు ఫైల్ పంపినట్లు తేలిందని అంటున్నారు. అదే నిజం అయితే.. జరిగిన భారీ అనర్ధాలకు రివ్యూ కంమిటీనే బాధ్యత వహించవలసి ఉంటుంది కదా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
అంతే కాదు.. ఇంత పెద్ద ఎత్తున, వారు వీరని లేకుండా.. వందల వేల మంది ఫోన్లు ట్యాప్ చేసిన మెగా కేసును,విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం(సిట్) సరి పోతుందా? సిట్ విచారణతో ఒకరిపై ఒకరు రాజకీయ బురద చల్లుకోవడం, తుడుచుకోవడం కాకుండా.. ఇంకా ఏమైనా జరుగుతుందా? అంటే.. ఆ అవకాశమే లేదంటున్నారు. కేసు పరిధి, పరిమాణంతో పాటు గా.. కేంద్ర ప్రభుత్వ చట్టాలతోనూ ముడిపడిన ఈ కేసు విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించడం ఒక్కటే మార్గమని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.అయితే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించేలా లేదు. చివరకు.. ఇప్పటికే చాల చాలా కేసుల్లో జరిగిన విధంబుగానే .. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా,‘గజం మిథ్య పలాయనం మిథ్య’ అన్నట్లు తేలిపోతుందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/phone-tapping-sit-inquiry-39-200578.html












