ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారుల ఎదుట హాజరైన మాజీ మేయర్
Publish Date:Jun 3, 2026
Advertisement
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బడంగ్‌పేట్ మాజీ మేయర్ పారిజాత సిట్ అధికారుల ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 30 నిమిషాల పాటు తనతో పాటు తన భర్త స్టేట్‌మెంట్‌ను కూడా అధికారులు రికార్డు చేశారని తెలిపారు. 2022 సంవత్సరంలో తమ ఇద్దరి ఫోన్‌లు ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్ అధికారులు వెల్లడించారని ఆమె చెప్పారు. అధికారులు చెప్పే వరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం తమకు తెలియదని పేర్కొన్నారు. భార్యాభర్తలిద్దరి ఫోన్‌లను ట్యాప్ చేయడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో తమ ఫోన్‌లను ట్యాప్ చేసి అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ప్రజా సేవలో నిరంతరం నిమగ్నమై ఉండటంతో ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయాన్ని గుర్తించలేకపోయామని తెలిపారు. ఎన్నికల సమయంలో తమ కదలికలపై నిరంతరం నిఘా ఉంచినట్లు అనిపించేదని చెప్పారు. గత ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఓ మహిళా నేత ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చనే అనుమానం తనకు ఉందని పారిజాత పేర్కొన్నారు. అయితే దీనిపై పూర్తి నిజాలు దర్యాప్తు ద్వారానే వెలుగులోకి వస్తాయని అన్నారు. సిట్ దర్యాప్తుపై పూర్తి విశ్వాసం ఉందని, ప్రభుత్వం ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని పారిజాత తెలిపారు.
http://www.teluguone.com/news/content/phone-tapping-case-36-221668.html





