ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు
Publish Date:Jan 8, 2026
Advertisement
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ నేతలపై దృష్టి సారించిన సిట్, కీలక నేతలకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టింది. ఇప్పటికే పలువురు నేతలను ప్రశ్నించిన సిట్, తాజాగా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను విచారణ కు పిలిచింది. నోటిసీలకు స్పందించిన జైపాల్ యాదవ్ సిట్ ఎదుట హాజరై వివరాలు వెల్లడించారు.గత ఏడాది నవంబర్ 17న కూడా జైపాల్ యాదవ్ సిట్ విచారణకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. అప్పట్లో ఇచ్చిన వాంగ్మూలంతో పాటు తాజా విచారణలో వెల్లడైన అంశాలను సిట్ సమగ్రంగా పరిశీలిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుప తన్నతో జైపాల్ యాదవ్‌కు ఎన్నికల సమయంలో ఫోన్ సంభాషణలు జరిగినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. ఆ కాల్స్ ఉద్దేశం, పరిస్థితులపై సిట్ లోతుగా విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఒక కేసుకు సంబంధించి భార్యాభర్తల మధ్య నెలకొన్న సమస్యపై తిరుపతన్నతో జైపాల్ యాదవ్ మాట్లాడి నట్లు సిట్‌కు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంభాషణలు వ్యక్తిగత అంశాలకే పరిమితమా? లేక అధికార దుర్వినియోగం జరిగిందా? అనే కోణంలో సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ కాల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి, కాల్ డేటా రికార్డులు, టైమింగ్, కాల్ వ్యవధి వంటి అంశాలను విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం పాత్రపై ఇప్పటికే తీవ్ర చర్చ జరుగు తున్న నేపథ్యంలో, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో సిట్ అధికా రులు జైపాల్ యాదవ్ నుంచి విస్తృతంగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాలను స్పష్టంగా తెలుసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది.ఇదే సమయంలో బీఆర్‌ఎస్ మరో మాజీ ఎమ్మెల్యే చిరు మర్తి లింగయ్య కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన నుంచి కూడా కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా పలువురు నేతలు, అధికారులు విచారణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/phone-tapping-case-36-212227.html





