చంద్రబాబును ప్రజలే కాపాడుకోవాలి?
Publish Date:Aug 26, 2022
Advertisement
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్ జీ భద్రతను భారీగా పెంచారు. ఇప్పటి దాకా 6+6 గా ఉన్న ఆయన భద్రతను 12+12కు ఎన్ఎస్జీ పెంచింది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబుకు శుక్రవారం నుంచే ఎన్ఎస్జీ భద్రతను రెట్టింపు చేయడానికి కారణం ఏదో ఉండి ఉంటుందనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎన్ఎస్జీ డీఐజీ సమరదీప్ సింగ్ నేతృత్వంలో ఒక బృందం అకస్మాత్తుగా ఢిల్లీ నుంచి వచ్చి గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ప్రతి గదికీ వెళ్లి నిశితంగా పరిశీలించడం, మరుసటి రోజే ఆయనకు ఎన్ఎస్జీ భద్రతను రెట్టింపు చేయడం టీడీపీ నేతలు, శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే చంద్రబాబు నాయుడి భద్రత గురించి ఎన్ఎస్జీ డీఐజీ పరిశీలించడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదికల ఆధారంగానే ఎన్ఎస్జీ డీఐజీ ఇలా అకస్మాత్తుగా సమీక్షించారు. ఈ క్రమంలో రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులను కూడా సమరదీప్ సింగ్ కలిసినట్లు సమాచారం. ఏపీలో ఇటీవలి కాలంలో అధికార- విపక్ష టీడీపీ- జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విధానపరమైన విమర్శలు కాకుండా పార్టీల నేతలు వ్యక్తిగత విమర్శలు, తిట్ల దండకాలతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన సందర్భంగా అధికార వైసీపీ, టీడీపీ నేతలు, శ్రేణుల మధ్య ఘర్షణాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లు, హింస వైసీపీ- టీడీపీ మధ్య రచ్చకు మరింత ఆజ్యం పోశాయి. టీడీపీ నేతలు తమ శ్రేణులను చితకబాదారని వైసీపీ ఆరోపిస్తోంది. పోలీసులను వినియోగించి తమ పైనే వైసీపీ దాడి చేయించిందని టీడీపీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. కుప్పంలో దాడులు జరిగిన సందర్భంలో జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న చంద్రబాబు నాయుడి పైన కూడా వైసీపీ మూకలు దాడికి యత్నించడం ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబుకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు. వాస్తవానికి కీలకమైన పదవుల్లో ఉన్నవారికి టెర్రరిస్టులు, మావోయిస్టుల నుంచి ముప్పు ఉంటుంది. అలాంటి వీఐపీలకు నేషనల్ సెక్కూరిటీ గ్రూప్ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తుంది. జెడ్ ప్లస్ భద్రత కలిగిన చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పంలో చోటుచేసుకున్న సంఘటనలు ఆయన భద్రతకు ముప్పు ఉందనేందుకు సూచనలంటున్నారు. చంద్రబాబు కాన్వాయ్ పై వైసీపీ శ్రేణులు రాళ్లు విసిరేందుకు యత్నించినట్లు వార్తలు రావడం గమనార్హం. కుప్పం ఘటనలతో ఒక్కసారిగా చంద్రబాబులో ఆగ్రహం పెల్లుబికింది. వైసీపీ శ్రేణులు, నేతల ఆగడాలను నిరోధించకుండా పోలీసులు చోద్యం చూడడంపై విరుచుకుపడ్డారు. 60 వేల మంది ఉన్న పోలీసులపై 60 లక్షల మంది ఉన్న టీడీపీ శ్రేణులు విజృంభిస్తే.. వారి గతి ఏమవుతుందో ఊహించుకోవాలని హెచ్చరించారు. అన్నా క్యాంటీన్ వద్ధ వైసీపీ శ్రేణులు బ్యానర్లు చింపి, అన్నా క్యాంటిన్ ను ధ్వంసం చేసిన ఘటనా స్థలాన్ని పరిశీలించి, అక్కడే రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. మా కార్యకర్తలను కొడితే.. నేను మీ ఇళ్లకు వచ్చి కొడతా’ అని హెచ్చరించారు. ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చిన తొలి రోజుల్లోనే చంద్రబాబు ‘ఛలో ఆత్మకూరు’లో పాల్గొనకుండా నిరోధించేందుకు ఆయన ఇంటి గేట్లకు తాళ్లు వేశారు. చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన ప్రయాణించే బస్సుపై చెప్పులు, రాళ్లు వేశారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చారు. చంద్రబాబును భౌతికంగా ఇబ్బంది పెట్టే యత్నాలు జరుగుతున్నాయన్న ఇంటెలిజెన్స్ నివేదికలతో కేంద్రం ఆయన రక్షణపై దృష్టి సారించిందంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న పర్యటనల్లో వైసీపీ శ్రేణులు తరచుగా గొడవలు సృష్టిస్తున్నారు. కొన్ని నెలల క్రితం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై రాళ్ల దాడి లాంటి పరిణామాలు కూడా చంద్రబాబుకు భద్రత పెంచే విషయంపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందంటున్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడి విషయంలో, టీడీపీ విషయంలో వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే.. ఆయనకు ముప్పేదో ఉందనే సంకేతాలు వస్తున్నాయని ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చంద్రబాబుకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే ప్రజలే ఆయనను కాపాడుకోవాలని వారు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/people-should-save-chandrababu-25-142706.html





