పెద్ది సుదర్శన్ రెడ్డికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలింపు..!
Publish Date:Jul 26, 2026
Advertisement
మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ.. ! బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురికావడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అస్వస్థతకు గురైన వెంటనే ఆయనను హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించి వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ, గుండె సంబంధిత సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మరింత మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచించారు. వైద్యుల అంచనా ప్రకారం ఆయనకు గుండె రక్తనాళాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారని, పరిస్థితిని బట్టి స్టెంట్ అమర్చడం లేదా బైపాస్ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి అత్యవసరంగా అంబులెన్స్‌లో తరలించే నిర్ణయం తీసుకున్నారు. రోగి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించగా, హనుమ కొండ నుంచి హైదరాబాద్ వరకు ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌కు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు మార్గమంతా ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ వేగంగా ప్రయాణించేలా చర్యలు చేపట్టారు. దీంతో సుమారు గంటన్నర వ్యవధిలోనే ఆయనను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రయాణిస్తున్న అంబులెన్స్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కార్లలో అనుసరిస్తూ పరిస్థితిని ఎప్పటి కప్పుడు సమీక్షిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ఆయన కుటుంబ సభ్యులు, కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, జిల్లా నాయకులతో నిరంతరం ఫోన్లో మాట్లాడుతూ వైద్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌కు ప్రత్యేకంగా ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైద్యులు కూడా ఎప్పటి కప్పుడు చికిత్స పురోగతి ని కేసీఆర్‌కు వివరిస్తు న్నారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, స్థానిక ప్రజలు ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో నిపుణుల బృందం ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. Peddi Sudarshan Reddy Health, BRS Former MLA Sudarshan Reddy, Heart Attack Hanamkonda, Rohini Hospital Warangal, Telangana BRS News, Secunderabad Yashoda, Harish Rao
http://www.teluguone.com/news/content/peddi-sudarshan-reddy-health-36-227153.html





