ఎంతకాలం బతికినం అనేది కాదు.. ఎట్లా బతికినం అనేది ముఖ్యం..! : కేటీఆర్
Publish Date:Aug 10, 2026
Advertisement
పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో కంటతడి పెట్టిన హరీశ్ రావు..! తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా నర్సంపేట ప్రాంతాభివృద్ధిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. నల్లబెల్లి వేదికగా ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో బీఆర్ఎస్ అగ్రనేతలు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన సెంటిమెంట్స్ అక్కడున్న వారందరినీ తీవ్ర భావోద్వేగానికి గురిచేసాయి. ప్రజల కోసం నిరంతరం తపించే గొప్ప నాయకుడిని కోల్పోవడం నర్సంపేట నియోజకవర్గానికే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సంతాప సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్ రెడ్డి కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచించే గొప్ప అభ్యుదయవాది అని కొనియాడారు. రాజకీయాధికారం ఉన్నా లేకపోయినా నర్సంపేట ప్రజల సంక్షేమం, ప్రాంతాభివృద్ధి కోసమే ఆయన నిరంతరం పరితపించారని గుర్తు చేసుకున్నారు. ఏ నర్సంపేట మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి తన ప్రాణప్రదంగా తాపత్రపడ్డారో, వచ్చే రెండేళ్లలో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కాగానే ఆ మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరును ఖచ్చితంగా పెట్టి తీరుతామని కేటీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు. ఆకాశంలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం నర్సంపేట చరిత్ర పుటల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెరగని ముద్రగా నిలిచిపోతుందన్నారు. రాజకీయాలకతీతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేటీఆర్ భరోసానిచ్చారు. కష్టకాలంలో ఆయన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతను పార్టీ స్వయంగా తీసుకుంటుందని చెప్పారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా బిఆర్ఎస్ ముందుంటుందని స్పష్టం చేశారు. నాయకుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నర్సంపేట ప్రజలకు, కార్యకర్తలకు ధైర్యం చెబుతూ, పెద్ది ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎంతకాలం బతికినం అనేది కాదు.. ఎట్లా బతికినం అనేది ముఖ్యమని కేటీఆర్ తెలిపారు. దానికి నిదర్శనం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు తరలివచ్చిన జనం.. లక్షకు పైగా మంది 12 గంటల పాటు వర్షం పడుతున్నా ఎక్కడికి వెళ్లకుండా అంతిమయాత్రలో పాల్గొన్నారని కేటీఆర్ తెలిపారు. మరోవైపు మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి తెలంగాణ ప్రజా ఉద్యమంలోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర చాలా కీలకమైనదని, అంతటి పెద్ద నాయకుడైనా ఎంతో సాధారణ జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఇటీవల పెద్ధితో కలిసి తాను పాల్గొన్న పురాతన దేవాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలోని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ హరీశ్ రావు కంటతడి పెట్టారు. ఆనాటి వేడుకనే ఆయనతో తనకు చివరి కలయిక అవుతుందని అస్సలు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆయనపై ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, భయపెట్టినా, అనేక రకాల ప్రలోభపెట్టినా ఏనాడూ తన సిద్ధాంతాల నుంచి తలొగ్గని ధీశాలి పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైన సమయంలో ప్రాణాలతో బ్రతికించడం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కాదని హరీశ్ రావు వివరించారు. ఎన్ని రకాల వైద్య సదుపాయాలు అందించినా, దేవుడి నిర్ణయం ముందు మనం ఏమీ చేయలేకపోయామని ఆవేదన చెందారు. సుదర్శన్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని, అయితే ఆయన కన్న కలలను నెరవేర్చేందుకు నర్సంపేట ప్రజలతో కలిసి బిఆర్ఎస్ శ్రేణులు ముందుకు సాగుతాయని హామీ ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చూపిన మార్గం, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటాయని, ఆయన జ్ఞాపకాలు నర్సంపేట గడ్డపై ఎప్పటికీ సజీవంగా నిలిచిపోతాయని నేతలు ముక్తకంఠంతో చాటిచెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పోరాటాలు, ప్రజాసేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్లోని అమర వీరుల స్తూపం వద్ద పోలీసులతో జరిగిన ఘర్షణలో నాకు దెబ్బ తగిలినప్పుడు.. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లిన పెద్ది సుదర్శన్ రెడ్డిని, అదే ఆసుపత్రిలో చివరి చూపు చూస్తానని కలలోనైనా ఊహించలేదని మాజీ మంత్రి భావోద్వేగానికి గురయ్యారు.
Peddi Sudarshan Reddy, KTR speech, Harish Rao emotional, Narsampet medical college, BRS party news, Warangal condolence meeting
http://www.teluguone.com/news/content/peddi-sudarshan-reddy-36-228554.html





